ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో కోట్లు కొల్లగొడుతున్న స్పోర్ట్స్‌ స్టార్లు వీళ్లే-top 10 sports stars who make millions out of one sponsored instagram post ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Top 10 Sports Stars Who Make Millions Out Of One Sponsored Instagram Post

ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో కోట్లు కొల్లగొడుతున్న స్పోర్ట్స్‌ స్టార్లు వీళ్లే

Hari Prasad S HT Telugu
Dec 22, 2021 05:55 PM IST

Instagram.. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కో పోస్ట్‌ వాళ్లపై కోట్ల వర్షం కురిపిస్తుంది. ఇలా సంపాదించే వాళ్లలో సహజంగానే స్పోర్ట్స్‌ స్టార్స్‌ ముందు వరుసలో ఉన్నారు. మన ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నుంచి మేటి ఫుట్‌బాలర్‌ రొనాల్డో వరకూ ఎంతో మంది స్పోర్ట్స్‌ పర్సన్స్‌.. ఇలా కోట్లు గడిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ సంపాదనలోనూ క్రిస్టియానో రొనాల్డోనే టాప్
ఇన్‌స్టాగ్రామ్‌ సంపాదనలోనూ క్రిస్టియానో రొనాల్డోనే టాప్ (Reuters)

Instagram.. ఇన్‌స్టాగ్రామ్‌ అనేది ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌. ఇందులో నెలకు 100 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. వీళ్లు రోజుకు 10 కోట్ల వరకూ ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటారు. కానీ వీళ్లలో 99 శాతం మందికి ఇదొక టైంపాస్‌ మీడియం. కానీ కొంతమంది ఇదే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కో పోస్ట్‌ వాళ్లపై కోట్ల వర్షం కురిపిస్తుంది. ఇలా సంపాదించేవాళ్లలో సహజంగానే స్పోర్ట్స్‌ స్టార్స్‌ ముందు వరుసలో ఉన్నారు. మన ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నుంచి మేటి ఫుట్‌బాలర్‌ రొనాల్డో వరకూ ఎంతో మంది స్పోర్ట్స్‌ పర్సన్స్‌.. వాళ్ల అకౌంట్లలో చేసే పోస్టులతో కోట్లు గడిస్తున్నారు. అలా ఈ ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌లో ఉన్న టాప్‌ 10 స్పోర్ట్స్‌ స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

క్రిస్టియానో రొనాల్డో

ఈ పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఈ రిచ్‌లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కో పోస్టు రొనాల్డో ఖాతాలో 16,04,000 డాలర్లు (సుమారు రూ. 12 కోట్లు) పడేలా చేస్తుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి కూడా రొనాల్డోనే. అతన్ని ప్రస్తుతం 30 కోట్ల మందికిపైగా ఫాలో అవుతున్నారు.

లియెనెల్‌ మెస్సీ

సమకాలీన ఫుట్‌బాల్‌లో రొనాల్డోకు పోటీ ఇచ్చే మరో స్టార్‌ లియోనెల్‌ మెస్సీ. ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ చేసే ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 11,69,000 డాలర్లు (సుమారు రూ. 8.7 కోట్లు) వస్తాయి. అతనికి ఇన్‌స్టాలో 23 కోట్ల మంది వరకూ ఫాలోవర్లు ఉన్నారు.

నెయ్‌మార్‌ డ సిల్వా శాంటోస్‌

బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ నెయ్‌మార్‌ ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లోనే కాదు.. సోషల్‌ మీడియాలో కూడా రొనాల్డో, మెస్సీలకు పోటీ ఇస్తున్నాడు. నెయ్‌మార్ ఇన్‌స్టాలో చేసే ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 8.24 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.13 కోట్లు) అందుకుంటాడు.

విరాట్‌ కోహ్లి

ఇండియాలోనే అత్యధిక మంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న వ్యక్తి మన క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్ విరాట్‌ కోహ్లి. అందుకు తగినట్లే ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు విరాట్‌ 6.8 లక్షల డాలర్లు (సుమారు రూ. 5 కోట్లు) ఆర్జిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 20 లిస్ట్‌లో ఉన్న ఏకైక ఇండియన్‌ కూడా కోహ్లినే కావడం విశేషం.

లెబ్రాన్‌ జేమ్స్‌

ఈ అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ ఒక్కో స్పాన్సర్డ్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు 4.74 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.53 కోట్లు) అందుకుంటున్నాడు.

డేవిడ్‌ బెక్‌హామ్‌

ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అయినా ఈ ఇంగ్లండ్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో అతడు ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 3.62 లక్షల డాలర్లు (సుమారు రూ. 2.69 కోట్లు) అందుకుంటున్నాడు.

రొనాల్డో డి అసిస్‌ మొరీరా

బ్రెజిల్‌ మాజీ ఫుట్‌బాలర్‌ అయిన రొనాల్డోకు ఇన్‌స్టాలో 5.59 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు ఒక్కో పోస్ట్‌కు 3 లక్షల డాలర్లు అందుకుంటాడు.

జ్లాతాన్‌ ఇబ్రహిమోవిచ్‌

ఈ రష్యన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌కు ఇన్‌స్టాలో 4.79 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతనికి ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 2.59 లక్షల డాలర్లు లభిస్తున్నాయి.

గారెత్‌ బేల్‌

ఇన్‌స్టాలో 4 కోట్లకుపైగా ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాలర్‌ గారెత్‌ బేల్‌ ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 2.38 లక్షల డాలర్లు చార్జ్‌ చేస్తున్నాడు.

మహ్మద్‌ సలాహ్‌

ఈజిప్ట్‌ స్టార్ ఫుట్‌బాలర్‌ మహ్మద్‌ సలాహ్‌కు ఇన్‌స్టాలో 4.28 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 2.31 లక్షల డాలర్లు వసూలు చేస్తున్నాడు.

 

WhatsApp channel

సంబంధిత కథనం