Top 5 Scores in T20s: టీ20 మ్యాచ్‌లలో నమోదైన టాప్ 5 అత్యధిక స్కోర్లు ఇవే
సహజంగానే దాదాపు ప్రతి టీ20 మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఈ ఫార్మాట్ వచ్చిన తర్వాతే ఓవర్‌కు 8, 9, 10 పరుగులు చేయడం కూడా చాలా కామనైపోయింది. ఈ నేపథ్యంలో అసలు ఓ టీ20 మ్యాచ్ మొత్తంలో నమోదైన అత్యధిక పరుగులు రికార్డు ఏంటని తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది.
క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత బౌలర్లు బెంబేలెత్తేలా.. బాల్స్ పగిలిపోయేలా బ్యాట్స్‌మెన్ చెలరేగుతున్నారు. మూడు గంటల్లో ముగిసే ఈ ఇన్‌స్టాంట్ క్రికెట్‌లో బాదడమే పని. బాల్ పిచ్ అయిందే ఆలస్యం.. దానిని బౌండరీ లైన్ బయటకు పంపించాలని బ్యాట్స్‌మెన్ ఉవ్విళ్లూరుతుంటారు. దీంతో సహజంగానే దాదాపు ప్రతి టీ20 మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఈ ఫార్మాట్ వచ్చిన తర్వాతే ఓవర్‌కు 8, 9, 10 పరుగులు చేయడం కూడా చాలా కామనైపోయింది.
ఈ నేపథ్యంలో అసలు ఓ టీ20 మ్యాచ్ మొత్తంలో నమోదైన అత్యధిక పరుగులు రికార్డు ఏంటని తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది. నిజానికి ఈ ఫార్మాట్‌లో ఓ మ్యాచ్‌లో నమోదైన మొత్తం పరుగుల రికార్డు 497 పరుగులు. 2016లో ఒటాగో, సెంట్రల్ డీ టీమ్స్ మధ్య జరిగిన ఓ దేశవాళీ టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ రికార్డు మాత్రం 489 పరుగులే. మరి ఈ లిస్ట్‌లో టాప్ 5లో ఉన్న మ్యాచ్‌లేవో ఒకసారి చూద్దాం.
ఇండియా vs వెస్టిండీస్ : 489 పరుగులు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే. 2016లోనే ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఈ రికార్డు స్కోరు సాధ్యమైంది. ఈ మ్యాచ్‌లో ఇండియా కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం ప్రస్తావనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఎవిన్ లూయిస్ సెంచరీ చేయడంతో 20 ఓవర్లలో 245 పరుగులు చేసింది. దీనికి టీమిండియా కూడా దీటుగానే బదులిచ్చింది.
కేఎల్ రాహుల్ సెంచరీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో ఓ దశలో మ్యాచ్‌లో గెలిచేలా కనిపించినా.. చివరికి 20 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. పరుగు తేడాతో విండీస్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు టీమ్స్ కలిపి చేసిన 489 పరుగుల రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. మ్యాచ్‌లో సగటున ప్రతి ఓవర్‌కు 12.22 పరుగులు రావడం విశేషం.
న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా : 488 పరుగులు
2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 488 పరుగులు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ సెంచరీ చేయగా, కొలిన్ మన్రో 76 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత ఛేజింగ్‌లో ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (59), డీఆర్సీ షార్ట్ (76) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 245 పరుగులు చేసింది.
ఆఫ్ఘనిస్థాన్ vs ఐర్లాండ్ : 472 పరుగులు
క్రికెట్‌లో పనికూనలైన ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్ మధ్య 2019లో డెహ్రడూన్‌లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో 472 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో ఏకంగా 278 పరుగులు చేసింది. ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ కేవలం 62 బంతుల్లో 162 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 సిక్స్‌లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత చేజింగ్‌లో ఐర్లాండ్ కూడా దీటుగానే ఆడింది. అయితే 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐర్లాండ్ టీమ్‌లోనూ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 50 బంతుల్లో 91 పరుగులు చేశాడు.
సౌతాఫ్రికా vs వెస్టిండీస్ (467 పరుగులు)
సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య 2015లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో 467 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ డుప్లెస్సి 119 పరుగులు చేయడంతో ఆ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేసింది. అయితే ఇంత స్కోరు కూడా భారీ హిట్టర్లు ఉన్న విండీస్ టీమ్ ముందు చిన్నబోయింది. ఓపెనర్ క్రిస్ గేల్ 41 బంతుల్లోనే 90, మార్లన్ శామ్యూల్స్ 39 బంతుల్లోనే 60 పరుగులు చేయడంతో వెస్టిండీస్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లకు 236 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా (459 పరుగులు)
ఈ మ్యాచ్ 2016 వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబైలో జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆమ్లా, డీకాక్, డుమిని హాఫ్ సెంచరీలు చేశారు. అయితే ఇంత భారీ లక్ష్యాన్ని కూడా ఇంగ్లండ్ చేజ్ చేయగలిగింది. జో రూట్ 44 బంతుల్లో 83 పరుగులతో ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరికి 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ 230 పరుగులు చేసింది.
సంబంధిత కథనం