World Cup 2023 Dates: అక్టోబరులో ప్రపంచకప్.. ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్.. ఎక్కడంటే?
World Cup 2023 Dates: వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబరులో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసిందట. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం నవంబరు 19న పైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారని సమాచారం. ఇందుకు అహ్మదాబాద్ వేదిక కానుందట.
World Cup 2023 Dates: ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఫ్యాన్సే కాకుండా సగటు క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ నెగ్గని భారత్.. ఈ సారి ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రపంచకప్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈఎస్పీఎన్ క్రిన్ ఇన్ఫో రిపోర్టు ప్రకారం వన్డే ప్రపంచకప్ అక్టోబరులో నిర్వహించనున్నారట. అక్టోబరు 5న ప్రారంభమై నవంబరు 19న జరిగే ఫైనల్‌తో ముగుస్తుందని సమాచారం. భారత క్రికెట్ బోర్డు(BCCI) ఈ టోర్నీ కోసం 12 వేదికలను కూడా షార్ట్ లిస్ట్ చేసిందట.
ప్రపంచకప్ ఫైనల్‌ను అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసిందని సమాచారం. ఇది కాకుండా బెంగళూరు, చెన్నై, దిల్లీ, ధర్మశాల, గువహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబయి వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో 10 జట్లు 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ప్రధాన మ్యాచ్ జరిగే ఈ వేదికలు కాకుండా.. టోర్నమెంట్ కంటే ముందు జరగనున్న వార్మప్ మ్యాచ్‌ల కోసం మరో 2-3 వేదికలను కూడా బీసీసీఐ సిద్ధం చేసినట్లు సమాచారం. వర్షం పడే అవకాశాలు, సకాలంలో ఫీల్డ్‌ను సిద్ధం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల అవసరాలు లాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ వేదికలను ఎంపిక చేసింది.
సాధారణంగా ప్రపంచకప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఓ ఏడాదికి ముందుగానే ఐసీసీ ప్రకటిస్తుంది. కానీ ఈ సారి మాత్రం పాకిస్థాన్ క్రికెటర్ల వీసాల పరిస్థితి, భారత ప్రభుత్వం అందించే పన్ను మినహాయింపులను అర్థం చేసుకోవానికి గానూ షెడ్యూల్ ప్రకటించకుండా ఇంకా వేచి ఉంది. బీసీసీఐ, ఐసీసీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 2016 నుంచి 2013 వరకు మూడు టోర్నమెంట్లకు పన్ను మినహాయింపు హామీని ఇచ్చారు. ఐసీసీకి సహాయం చేయడానికి బీసీసీఐ పన్ను మినహాయింపునకు బాధ్యత కలిగి ఉందని నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉంటే మరోవైపు పాకిస్థాన్ క్రికెటర్లు 2013 నుంచి ఏ టోర్నీ కోసం కూడా భారత పర్యటనకు రాలేదని, అయితే వారి వీసాలను భారత ప్రభుత్వం క్లియర్ చేసిందని బీసీసీఐ స్పష్టం చేసింది. 2013 తర్వాత ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో మినహా ఇంతవరకు ఏ సిరీస్‌ల్లోనూ ఆడలేదు. అంతేకాకుండా ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లడానికి భారత్ విముఖంగా ఉండటంతో ప్రపంచకప్ కోసం తాము కూడా భారత్‌కు రాబోమని పాక్ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం చర్చల దశలోనే ఉంది.