Pro Kabaddi League Telugu Titans: తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి - యూపీ యోధాస్, దబాంగ్ ఢిల్లీ బోణీ
Pro Kabaddi League Telugu Titans: ప్రో కబడ్డీ సీజన్ 9 తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. ఇతర మ్యాచ్‌లలో దబాంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ బోణీ కొట్టాయి.
Pro Kabaddi League Telugu Titans: ప్రో కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ ను ఓటమితో మొదలుపెట్టింది తెలుగు టైటాన్స్. శుక్రవారం బెంగళూరు బూల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 - 29 తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ నుంచి రజినీష్ (ఏడు పాయింట్లు), కెప్టెన్ సిద్ధార్థ్ దేశాయ్ (4 పాయింట్లు), వినయ్ (ఏడు పాయింట్లు)తో రాణించారు. కానీ చివరి నిమిషంలో తెలుగు టైటాన్స్ తప్పులు చేయడం బెంగళూరు బుల్స్‌కు కలిసివచ్చింది.
ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ స్టార్ డిఫెండర్స్ రవీందర్ పెహల్, విశాల్ భరద్వాజ్ ట్యాక్లింగ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు బెంగళూరు బుల్స్ నుంచి నీరజ్ తో పాటు స్టార్ రైడర్ వికాస్ ఖండోలా, భరత్ రాణించారు.
మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 34 -32 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో యూపీ యోధాస్ స్టార్ ప్లేయర్ పర్‌దీప్ నర్వాల్ ఏడు రైడింగ్ పాయింట్లతో మెరివగా సురేందర్ గిల్ తొమ్మిది పాయింట్లు సాధించాడు.
యూపీ యోధాస్‌కు జైపూర్ పింక్ ఫాంథర్స్ గట్టి పోటీ ఇచ్చింది. జైపూర్ పింక్ ఫాంథర్స్ ప్లేయర్ అర్జున్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లోయూ ముంబాపై దబాంగ్ ఢిల్లీ 41-27తో విజయాన్ని సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో దబాండ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 13 పాయింట్లతో చెలరేగాడు.