కొన్నేళ్లుగా భారత కాంపౌండ్ ఆర్చరీ టార్చ్ బేరర్ గా సాగుతున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఒలింపిక్స్ డ్రీమ్ నిజం కాబోతోంది. ఇన్ని రోజులూ ఒలింపిక్స్ ఆడాలనే టార్గెట్ తో సాగుతున్న ఈ విజయవాడ ఆర్చర్ కు ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ వచ్చింది. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ఈవెంట్ చేర్చడమే ఇందుకు కారణం. కాంపౌండ్ ఆర్చరీలో పోటీపడే సురేఖ.. ఇన్ని రోజులూ ఒలింపిక్స్ లో ఈ విభాగం లేకపోవడంతో నిరాశ చెందేది.
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కంపౌండ్ ఆర్చరీ (మిక్స్‌డ్ టీమ్) చేరుస్తున్నట్లు బుధవారం (ఏప్రిల్ 9) ప్రకటించడం భారత ఆర్చర్లకు గుడ్ న్యూస్ లాంటిదే. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఈవెంట్స్ లిస్ట్ ను ఆమోదించింది. అథ్లెటిక్స్ (4x100 మీటర్లు రిలే), గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, రోయింగ్ కోస్టల్ బీచ్ స్ప్రింట్, టేబుల్ టెన్నిస్‌లోనూ ఇతర ఈవెంట్లను చేర్చింది.
ఆర్చరీ చాలా కాలంగా ఒలింపిక్స్‌లో ఉన్నప్పటికీ, కంపౌండ్ కేటగిరీని చేర్చడం ఇదే ఫస్ట్ టైమ్. ఒక కంపౌండ్ బౌ సాంప్రదాయ రికర్వ్ బౌ కంటే చాలా టెక్నికల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఐదు రికర్వ్ ఈవెంట్లతో పాటు కంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ చేరడంతో మొత్తం ఆర్చరీ పతకాలు ఆరుకు చేరుకున్నాయి.
భారత కాంపౌండ్ ఆర్చరీ అనగానే ఫస్ట్ వెన్నం జ్యోతి సురేఖ పేరు వినిపిస్తోంది. ఈ క్రీడపై సురేఖ వేసిన ముద్ర అలాంటింది. గత కొన్నేళ్లుగా ఆమె అంతర్జాతీయ వేదికలపై పతాకలు పంట పండిస్తోంది. రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఆసియా గేమ్స్, ఆసియా ఛాంపియన్ షిప్స్, ప్రపంచకప్, ప్రపంచ ఛాంపియన్ షిప్స్ ఇలా పోటీ ఏదైనా పతక గురితో అదరగొడుతోంది. విల్లు నుంచి బాణాలు వదిలి పతకాలతో తిరిగొస్తోంది.
ఇప్పటివరకూ మేజర్ ఇంటర్నేషనల్ ఈవెంట్లలో జ్యోతి సురేఖ 17 స్వర్ణాలు గెలిచింది. 15 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్ ఖాతాలో వేసుకుంది. 2023 ఆసియా గేమ్స్ లో అయితే హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్చర్ గా నిలిచింది. ఇందులో ఇప్పుడు ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టబోతున్న మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ కూడా ఉంది.
మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో జ్యోతి సురేఖ ఇప్పటివరకూ ఆసియా గేమ్స్ లో ఓ గోల్డ్.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో ఓ సిల్వర్.. ప్రపంచకప్ ల్లో 4 గోల్డ్, ఓ సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. మిక్స్‌డ్ టీమ్ కేటగిరీలో ఓ పురుష, మహిళ ఆర్చర్ కలిసి పోటీపడతారు. ఇన్ని రోజులుగా అంతర్జాతీయ వేదికలపై పతకాలతో సత్తాచాటుతున్నా సురేఖ ఒలింపిక్స్ కల మాత్రం అలాగే ఉండిపోయింది.
ఒలింపిక్స్ లో కేవలం రికర్వ్ ఆర్చరీ మాత్రమే ఉంది. కాంపౌండ్ ఆర్చరీ లేదు. సురేఖ ఏమో కాంపౌండ్ ఆర్చరీలో పోటీపడుతోంది. అందుకే ఒలింపిక్స్ లో పోటీపడటం సందేహంగానే మారింది. ఆమె డ్రీమ్ అలాగే ఉండిపోతుందేమో అనిపించింది. కానీ లాస్ ఏంజిల్స్ లో జరిగే 2028 ఒలింపిక్స్ లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ను చేర్చడంతో 28 ఏళ్ల సురేఖ ఒలింపిక్స్ డ్రీమ్ నిజం కాబోతుంది.
సంబంధిత కథనం