Anil Kumble: అతడిని మళ్లీ టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకోవాలి: అనిల్ కుంబ్లే
Anil Kumble: భారత టెస్టు జట్టులో కుల్‍దీప్ యాదవ్‍కు మళ్లీ చోటివ్వాలని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఎందుకో వివరించాడు.
Anil Kumble: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించింది. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య విండీస్‍పై ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‍లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ముఖ్యంగా భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లో చెరో ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా రాణించాడు. కాగా, టీమిండియా టెస్టు జట్టులోకి మరో స్పిన్నర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని భారత జట్టు మాజీ హెడ్ కోచ్, స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే సూచించాడు.
భారత టెస్టు జట్టులోకి స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్‍ను తీసుకోవడంపై టీమ్ మేనేజ్‍మెంట్ ఆలోచించాలని అనిల్ కుంబ్లే అన్నాడు. చివరగా 2022 డిసెంబర్‌లో టెస్టు ఆడాడు కుల్‍దీప్. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‍కు ఎంపికైనా.. తుది జట్టులో ఛాన్స్ రాలేదు. ఇక, ఇప్పుడు వెస్టిండీస్ టెస్టు సిరీస్‍కు జట్టులోనే చోటు దక్కలేదు. అయితే, ఇదే పర్యటనలో వన్డే జట్టులో మాత్రం కుల్‍దీప్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులోకి కుల్‍దీప్‍ను మళ్లీ పరిగణనలోకి తీసుకోవాలని అనిల్ కుంబ్లే.. టీమ్ మేనేజ్‍మెంట్‍కు సూచించాడు.
“అతడు (కుల్‍దీప్).. కచ్చితంగా ఉండాలి. అతడు చాలా మంచి బౌలర్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లెగ్ స్పిన్నర్స్ చాలా అటాకింగ్‍గా బౌలింగ్ చేయగలరు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా టెస్టు టీమ్‍లో అతడికి అవకాశాలు ఇవ్వాలి” అని కుంబ్లే.. జియోసినిమాతో ఇంటర్వ్యూలో చెప్పాడు.
“టెస్టు మ్యాచ్‍ల కోసం కుల్‍దీప్ మంచి స్పిన్నర్. అవకాశం వచ్చినప్పుడల్లా అతడు బాగా పర్ఫార్మ్ చేశాడు. వైట్ బాల్ ఫార్మాట్‍లో చాలా మంది మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. కానీ టెస్టు మ్యాచ్‍ల్లో వారు ఎక్కువగా కనిపించడం లేదు” అని లెగ్ స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే అన్నాడు.
అశ్విన్, జడేజా ప్రస్తుతం బాగా రాణిస్తున్నారని, అక్షర్ కూడా మెరుగ్గా ఉన్నాడని అనిల్ కుంబ్లే చెప్పాడు. అయితే, వీలు చిక్కినప్పుడల్లా కుల్‍దీప్‍కు అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశాడు. కుల్‍దీప్‍ను టెస్టులకు ఎంపిక చేస్తూ.. చాన్స్ ఉన్నప్పుడల్లా అతడిని తుది జట్టులో ఆడించాలని అనిల్ కుంబ్లే సూచించాడు.
కాగా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా విజృంభణతో వెస్టిండీస్‍తో తొలి టెస్టులో టీమిండియా మూడు రోజులు ముగియకుండానే సునాయస విజయం సాధించి.. సిరీస్‍లో 1-0తో ముందడుగు వేసింది. దీంతో రెండో టెస్టులో యువ స్పిన్నర్ అక్షర్ పటేల్‍కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. జూలై 20న ఇండియా, వెస్టిండీస్ మధ్య సిరీస్‍లో చివరిదైన రెండో టెస్టు మొదలవుతుంది. ఈ టెస్టు ముగిశాక విండీస్‍తో వన్డే, టీ20 సిరీస్‍లు ఆడనుంది టీమిండియా.