Team India Prayed for Rishabh Pant: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తమ సహచర క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్ ఉజ్జయిని మహాకాలేశ్వుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు నిర్వహించిన వాళ్లలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.
గతేడాది డిసెంబర్ 30న పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే అతనికి రెండు సర్జరీలు జరిగాయి. క్రికెట్ లోకి రావడానికి అతనికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో పంత్ త్వరగా కోలుకోవాలంటూ ఈ ప్లేయర్స్ పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుఝామునే వీళ్లు ఆలయానికి వచ్చారు.
బయటకు వచ్చిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఏఎన్ఐతో మాట్లాడాడు. పంత్ తిరిగి రావడం టీమిండియాకు ఎంతో అవసరమని, అందుకే అతడు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థించినట్లు అతడు చెప్పాడు. న్యూజిలాండ్ తో మంగళవారం (జనవరి 24) ఇండోర్ లో టీమిండియా మూడో వన్డే ఆడనున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ కోసం ఇండోర్ వచ్చిన ఈ ప్లేయర్స్ ఉజ్జయినికి వెళ్లారు. ఇక న్యూజిలాండ్ తో జరగబోయే చివరి మ్యాచ్ కూడా గెలుస్తామని సూర్యకుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తూ పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు హాస్పిటల్ లోనే ఉన్నాడు. మొదట డెహ్రాడూన్ లో, తర్వాత ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ మధ్యే ప్రమాదం తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో పంత్ ఓ పోస్ట్ చేశాడు. తన కోసం ప్రార్థిస్తున్న అందరికీ పంత్ థ్యాంక్స్ చెప్పాడు. తన సర్జరీ విజయవంతమైందని, తన ముందున్న సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు పంత్ తెలిపాడు.
సంబంధిత కథనం