India ODI Rankings: వన్డేల్లో అగ్రపీఠాన్ని కోల్పోయిన భారత్.. నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో తొలి ఓటమి-team india lost their no 1 position in the odi rankings after losing odi series against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Team India Lost Their No.1 Position In The Odi Rankings After Losing Odi Series Against Australia

India ODI Rankings: వన్డేల్లో అగ్రపీఠాన్ని కోల్పోయిన భారత్.. నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో తొలి ఓటమి

Maragani Govardhan HT Telugu
Mar 23, 2023 06:20 AM IST

India ODI Rankings: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఓడిన భారత్.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దిగజారింది. తొలి ర్యాంకు నుంచి రెండో స్థానానికి దిగజారింది. స్వదేశంలో నాలుగేళ్ల తర్వతా వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి.

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ (PTI)

India ODI Rankings: చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న భారత్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. స్టీవ్ స్మిత సారథ్యంలో ఆసీస్ అద్భుత ప్రదర్శనతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోవడం 2019 తర్వాత భారత్‌కు ఇదే తొలిసారి. తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ రోహిత్ సేన అగ్రపీఠాన్ని కోల్పోయింది.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానానికి దిగజారింది. 113 పాయింట్లతో ఆస్ట్రేలియాతో టై అవడంతో రెండో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కంగారూ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. మార్చి 2019 తర్వాత భారత్ వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. అప్పుడు కూడా ఆస్ట్రేలియాపైనే సిరీస్ 2-3 తేడాతో కోల్పోయింది.

ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అనంతరం శ్రీలంకపై కూడా 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గెలిచి మంచి ఆరంభాన్ని అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత వైజాగ్, చెన్నై వేదికగా జరిగిన రెండు వన్డేల్లోనూ ఓడిపోయి సిరీస్ సమర్పించుకుంది.

బుధవారం నాడు చెన్నై చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు నిర్దేశించిన 270 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కీలక భాగస్వామ్యాలను నిర్మించడంలో విఫలమైన భారత ఆటగాళ్లు చివరకు మ్యాచ్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించేశారు. విరాట్ కోహ్లీ (54) అర్ధశతకంతో ఆకట్టుకున్నా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా 4 వికెట్లతో రాణించి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

WhatsApp channel