Team India equal world record: ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును సమం చేసిన టీమిండియా
Team India equal world record: ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును సమం చేసింది టీమిండియా. సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన తర్వాత ఇండియన్ టీమ్ ఈ రికార్డు సాధించింది.
Team India equal world record: శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన విషయం తెలుసు కదా. మంగళవారం (అక్టోబర్ 11) మూడో వన్డేలో గెలిచిన తర్వాత 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఓ వరల్డ్ రికార్డును కూడా ఇండియన్ టీమ్ సమం చేసింది. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఆ రికార్డును ఇప్పుడు మన టీమ్ కూడా అందుకుంది.
మూడో వన్డేలో సౌతాఫ్రికాను కేవలం 99 రన్స్‌కే కట్టడి చేసిన టీమిండియా.. ఆ తర్వాత 19.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేజ్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 49 రన్స్ చేశాడు. ఇది 2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇండియన్ టీమ్ సాధించిన 38వ విజయం. ఒక ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి ఓ టీమ్ సాధించిన అత్యధిక విజయాల రికార్డును టీమిండియా సమం చేసింది.
గతంలో 2003లో రికీ పాంటింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా కూడా 38 విజయాలు సాధించింది. ఆ ఏడాది ఆసీస్ 30 వన్డేలు, 8 టెస్టుల్లో గెలిచింది. ఇప్పుడా రికార్డును ఇండియన్ టీమ్ సమం చేసింది. 2017లో 37 విజయాలతో తన పేరిట ఉన్న రికార్డును ఇండియన్ టీమ్ మరింత మెరుగుపరచుకుంది. 2022 సీజన్‌ను సౌతాఫ్రికా చేతిలో ఐదు వరుస పరాజయాలతో మొదలుపెట్టిన టీమిండియా.. తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లింది.
ఆ మ్యాచ్‌లు కోహ్లి, రాహుల్ కెప్టెన్సీలో కాగా.. రోహిత్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత ఇండియన్ టీమ్ దూకుడు పెరిగింది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలపై వరుస సిరీస్ విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో రోహిత్ సేన 23 వరుస విజయాల రికార్డును కూడా అందుకుంది. ఇప్పుడు రోహిత్ నేతృత్వంలోని సీనియర్ టీమ్ టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉండగా.. ధావన్ నేతృత్వంలోని యంగిండియా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడింది.
ఈ మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఇండియన్ టీమ్ తర్వాతి రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో 279 రన్స్ టార్గెట్‌ను చేజ్ చేసిన టీమ్.. మూడో వన్డేలో సౌతాఫ్రికాను కేవలం 99 రన్స్‌కే ఆలౌట్ చేసింది. కుల్దీప్ 4, సిరాజ్, షాబాజ్, సుందర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.