Team India chief selector: టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అతడేనా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కూ గుడ్‌బై చెప్పేశాడు
Team India chief selector: టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అతడేనా? ఢిల్లీ క్యాపిటల్స్‌కూ ఈ మాజీ ప్లేయర్ గుడ్‌బై చెప్పేయడం చూస్తే బీసీసీఐ అతని పేరును దాదాపు ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది.
Team India chief selector: టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎవరు? చేతన్ శర్మ ఈ పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాజాగా కొత్త ఛీఫ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే గతంలో ఓసారి ఈ పదవి కోసం ప్రయత్నించిన మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్.. ఈసారి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఈసారి సెలక్షన్ కమిటీ ఛీఫ్ పదవి అగార్కర్ ను వరించడం ఖాయమన్న అంచనాలు మొదలయ్యాయి.

దీనికితోడు గురువారం (జూన్ 29) ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తమ అసిస్టెంట్ కోచ్ గా ఉన్న అజిత్ అగార్కర్ తో ఒప్పందాన్ని ముగించింది. దీంతో టీమిండియా ఛీఫ్ సెలక్టర్ గా అతని పేరుగా అనౌన్స్ చేయడం లాంఛనమే అని మరోసారి స్పష్టమైంది. అగార్కర్ తోపాటు మరో అసిస్టెంట్ కోచ్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తప్పుకున్నాడు.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా డీసీ వెల్లడించింది. "ఇది ఎప్పటికీ మీ ఇల్లుగానే ఉంటుంది. అజిత్, వాటో మీ సేవలకు కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్" అనే క్యాప్షన్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విషయం చెప్పింది. ఇక టీమిండియా ఛీఫ్ సెలక్టర్ పదవి విషయానికి వస్తే దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30 చివరి తేదీ కాగా.. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది.
గతంలోనూ అగార్కర్ ఈ పదవి కోసం ప్రయత్నించినా.. దానిని దక్కించుకోలేకపోయాడు. టీమిండియా తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడిన అగార్కర్.. మంచి ఆల్ రౌండర్ గా పేరుగాంచాడు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ అతడు ఉన్నాడు. 2000 నుంచి 2010 మధ్య టీమిండియాలో కీలక ఆటగాడిగా అగార్కర్ ఎదిగాడు.