Tamil Nadu world record: క్రికెట్‌లో తమిళనాడు వరల్డ్ రికార్డ్.. 435 రన్స్‌తో విజయం
Tamil Nadu world record: లిస్ట్ ఎ క్రికెట్‌లో తమిళనాడు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌ను ఏకంగా 435 రన్స్‌తో ఓడించింది.
Tamil Nadu world record: లిస్ట్ ఎ క్రికెట్‌లో ఒకే రోజు రెండు వరల్డ్ రికార్డులు బ్రేకయ్యాయి. మొదట తమిళనాడు బ్యాటర్ జగదీశన్ లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేయగా.. ఇప్పుడు తమిళనాడు టీమ్ కూడా అరుణాచల్ ప్రదేశ్‌ను ఏకంగా 435 రన్స్‌తో చిత్తు చేసి మరో వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది.
ఇంతకుముందు లిస్ట్ ఎ క్రికెట్‌లో సోమర్‌సెట్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ టీమ్ 1990లో 346 రన్స్ తేడాతో విజయం సాధించింది. 32 ఏళ్ల తర్వాత ఆ వరల్డ్ రికార్డు మరుగున పడిపోయింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు మొదట బ్యాటింగ్ చేసి 2 వికెట్లకు 506 రన్స్ చేసింది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 28.4 ఓవర్లలో కేవలం 71 రన్స్‌కే చాప చుట్టేసింది.
లిస్ట్ ఎ మెన్స్ క్రికెట్‌లో తమిళనాడు చేసిన 506 స్కోరు కూడా వరల్డ్ రికార్డే. అంతకుముందు ఇంగ్లండ్ నమోదు చేసిన 498 రన్స్ రికార్డును తమిళనాడు బ్రేక్ చేసింది. ఇక ఆ టీమ్ బ్యాటర్ జగదీశన్ ఏకంగా 277 రన్స్ చేశాడు. ఈ క్రమంలో 2002లో సర్రే బ్యాటర్ అలిస్టర్ బ్రౌన్ 268 రన్స్‌తో క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డు కూడా బ్రేక్ అయింది. ఇక 264 రన్స్‌తో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డునూ జగదీశన్ చెరిపేశాడు.
ఇండియాలో ఇంతకుముందు అత్యధిక లిస్ట్ ఎ టోటల్ 457 కాగా.. ఇప్పుడు తమిళనాడు మరో 49 రన్స్ ఎక్కువే చేసింది. అప్పుడు పుదుచ్చెరిపై ముంబై ఈ స్కోరు సాధించగా.. ఇప్పుడా రికార్డు బ్రేకయింది. జగదీశన్ కేవలం 114 బాల్స్‌లోనే డబుల్ సెంచరీ చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కావడం ఓ రికార్డు. గతంలో ట్రెవిస్ హెడ్ కూడా సరిగ్గా 114 బాల్స్‌లోనే డబుల్ సెంచరీ చేయడం విశేషం.
జగదీశన్ తన ఇన్నింగ్స్‌లో 15 సిక్స్‌లు బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక సిక్స్‌ల రికార్డు. గతంలో 12 సిక్స్‌లతో యశస్వి జైస్వాల్ పేరుతో ఉన్న రికార్డు బ్రేకయింది. అంతేకాదు సాయిసుదర్శన్‌తో కలిసి తొలి వికెట్‌కు జగదీశన్ ఏకంగా 416 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్.
అటు సాయి సుదర్శన్ కూడా 154 రన్స్ చేశాడు. గతంలో లిస్ట్ ఎ క్రికెట్‌లో క్రిస్ గేల్, మార్లన్ శామ్యూల్స్ రెండో వికెట్‌కు 372 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. 2015లో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదు కాగా.. దానిని ఇప్పుడు జగదీశన్, సాయి సుదర్శన్ బ్రేక్ చేశారు.