ఇండియన్ టేబుల్ టెన్నిస్ లెజెండ్ ఆచంట శరత్ కమల్ కెరీర్ ముగిసింది. ఈ దిగ్గజం చివరి మ్యాచ్ ఆడేశాడు. ఓటమితో అతను నిష్క్రమించాడు. చెన్నైలో శనివారం (మార్చి 29) డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీ ప్రిక్వార్టర్స్ లో శరత్ ఓడాడు. తెలుగు కుర్రాడు ఆర్ఎస్ స్నేహిత్.. వెటరన్ శరత్ కమల్ ను ఓడించాడు.
భారత టీటీ దిగ్గజం శరత్ కమల్ తన చివరి మ్యాచ్ లో వరుస గేమ్‌ల్లో చిత్తయ్యాడు. 24 ఏళ్ల హైదరాబాదీ ఆటగాడు స్నేహిత్ కు 42 ఏళ్ల శరత్ పోటీ ఇవ్వలేకపోయాడు. తొలి గేమ్ 9-9తో ఈక్వల్ గా నిలిచిన సమయంలో శరత్ బాల్ ను నెట్ కు కొట్టాడు. ఈ గేమ్ ను స్నేహిత్ 11-9తో గెలుచుకున్నాడు. రెండో గేమ్ లో శరత్ 8-11తో ఓడిపోయాడు. మూడో గేమ్ లో 11-9తో నెగ్గిన స్నేహిత్ క్వార్టర్స్ చేరుకున్నాడు.
భారత్ లో టేబుల్ టెన్నిస్ కు పర్యాయ పదంగా మారిన దిగ్గజం శరత్ కమల్ మార్చి 5నే రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ టోర్నీ తో ఆటకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఓటమితో నిష్క్రమించాడు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ కు శరత్ ఎండ్ కార్డు వేశాడు.
తన కెరీర్ లో చివరి టోర్నీని శరత్ కమల్ చెన్నైలో నే ఆడాడు. అతను ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నీని కూడా చెన్నైలోనే ఆడాడు. ‘‘చెన్నైలో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ ఆడా. ఇప్పుడు చెన్నైలోనే చివరి అంతర్జాతీయ టోర్నీ ఆడబోతున్నా. ప్రొఫెషనల్ అథ్లెట్ గా ఇదే నా చివరి టోర్నీ’’ అని డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీ ప్రెస్ మీట్ లో 42 ఏళ్ల శరత్ ప్రకటించాడు.
శరత్ కమల్ తెలుగు కుటుంబానికి చెందిన ఆటగాడు. చెన్నైలో స్థిరపడ్డ ఆచంట శ్రీనివాస రావు, అన్నపూర్ణ దంపతులకు శరత్ కమల్ జన్మించాడు. నాలుగేళ్ల వయసులోనే శరత్ టేబుల్ టెన్నిస్ రాకెట్ చేతబట్టాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత్ టేబుల్ టెన్నిస్ కు టార్చ్ బేరర్ గా మారాడు. రికార్డు స్థాయిలో పది సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచాడు. ఇంకెన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు స్థాయిలో ఏడు స్వర్ణాలు గెలిచాడు. మరో మూడు రజతాలు, మూడు కాంస్యాలు ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నాడు.
శరత్ కమల్ అయిదు ఒలింపిక్స్ ల్లో బరిలో దిగాడు. చివరగా 2024 పారిస్ ఒలింపిక్స్ లో పోటీపడ్డాడు. కానీ ఒక్క ఒలింపిక్ మెడల్ కూడా సాధించలేకపోయాడు. ‘‘నా కెరీర్ లో కామన్వెల్త్ పతకాలున్నాయి. ఆసియా క్రీడల మెడల్స్ ఉన్నాయి. కానీ ఒలింపిక్ పతకమే మిస్సయింది. రాబోయే యువ ఆటగాళ్లు మెడల్ సాధిస్తే నా కల నిజమవుతుంది’’ అని శరత్ కమల్ పేర్కొన్నాడు.
సంబంధిత కథనం