T20 World Cup Tickets: టీ20 వరల్డ్‌కప్‌కు ఫుల్‌ క్రేజ్.. 6 లక్షలకుపైగా అమ్ముడైన టికెట్లు-t20 world cup tickets are on demand as over 6 lakh tickets sold till now ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  T20 World Cup Tickets: టీ20 వరల్డ్‌కప్‌కు ఫుల్‌ క్రేజ్.. 6 లక్షలకుపైగా అమ్ముడైన టికెట్లు

T20 World Cup Tickets: టీ20 వరల్డ్‌కప్‌కు ఫుల్‌ క్రేజ్.. 6 లక్షలకుపైగా అమ్ముడైన టికెట్లు

Hari Prasad S HT Telugu

T20 World Cup Tickets: టీ20 వరల్డ్‌కప్‌కు ఫుల్‌ క్రేజ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మెగా టోర్నీ చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచీ ఫ్యాన్స్‌ ఆస్ట్రేలియా రానున్నారు. ఇప్పటికే 6 లక్షలకుపైగా అమ్ముడైన టికెట్లు అమ్ముడయ్యాయి.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్

T20 World Cup Tickets: టీ20 వరల్డ్‌కప్‌లో తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం శ్రీలంక, నమీబియా మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. అయితే ఈసారి ఈ మ్యాచ్‌లు చూడటానికి అభిమానులు ఎగబడుతున్నారు. టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుండగా.. ఇప్పటికే 6 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు ఆర్గనైజర్లు శుక్రవారం (అక్టోబర్‌ 14) వెల్లడించారు.

ఇక టోర్నీలో భాగంగా జరిగే ముఖ్యమైన మ్యాచ్‌ల టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయి. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరగనున్న ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం నెల రోజు ముందే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. 90 వేల టికెట్లు ఐదు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడవగా.. తొలిసారి కేవలం నిల్చొని మ్యాచ్‌ చూసేందుకు వీలుగా మరో 4 వేల టికెట్లు రిలీజ్‌ చేశారు.

ఇవి కూడా పది నిమిషాల్లో అమ్ముడైనట్లు నిర్వాహకులు చెప్పారు. ఇక ఇండోపాక్‌ మ్యాచ్‌ కంటే ముందు రోజు సూపర్‌ 12 స్టేజ్‌ తొలి మ్యాచ్‌ గతేడాది ఫైనలిస్టులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరగబోయే ఈ మ్యాచ్‌ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడైపోయాయి. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లన్ని హౌజ్‌ఫుల్‌ ప్రేక్షకుల ముందు జరగనున్నాయి.

ఇక వరల్డ్‌కప్‌లో శ్రీలంక, నమీబియా మధ్య జరగబోయే తొలి మ్యాచ్‌కు కూడా ఇంకా కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ మ్యాచ్‌ గీలాంగ్‌లోని కార్డినియా పార్క్‌ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం కెపాసిటీ 36 వేలు కాగా.. టికెట్ల అమ్మకం దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిపారు. తొలి రోజు ఈ మ్యాచ్‌ తర్వాత యూఏఈ, నెదర్లాండ్స్‌ మధ్య మరో మ్యాచ్‌ కూడా అక్కడే జరగనుంది.