Telugu News  /  Sports  /  T20 World Cup Group 2 Semis Scenario Who Will Reach Semifinals India Or Pakistan
ఇండియా, పాకిస్థాన్ లో సెమీస్ చేరేది ఎవరు?
ఇండియా, పాకిస్థాన్ లో సెమీస్ చేరేది ఎవరు? (AP)

T20 World Cup Group 2 semis Scenario: ఇండియా, పాకిస్థాన్‌లలో సెమీస్‌ చేరేది ఎవరు?

04 November 2022, 8:00 ISTHari Prasad S
04 November 2022, 8:00 IST

T20 World Cup Group 2 Scenario: ఇండియా, పాకిస్థాన్‌లలో సెమీస్‌ చేరేది ఎవరు? సౌతాఫ్రికాపై ఘన విజయంతో పాకిస్థాన్ ఒక్కసారిగా సెమీస్‌ రేసులోకి రావడంతో గ్రూప్‌ 2లో సెమీఫైనల్‌ చేరేది ఎవరన్న ఉత్కంఠ పెరిగింది.

T20 World Cup Group 2 Scenario: ఈసారి టీ20 వరల్డ్‌కప్‌ రంజుగా సాగుతోంది. ఆస్ట్రేలియాలో వర్షాలు చిరాకు తెప్పిస్తున్నా.. సెమీఫైనల్‌ బెర్త్‌ల కోసం టీమ్స్‌ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇప్పటి వరకూ గ్రూప్‌ 1లోనే సెమీస్‌ రేసు ఆసక్తిగా సాగింది. అయితే గురువారం (నవంబర్ 3) సౌతాఫ్రికాపై పాకిస్థాన్‌ విజయంతో గ్రూప్‌ 2 కూడా ఉత్కంఠ రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు

టీమిండియా.. సౌతాఫ్రికా చేతుల్లో ఓడిపోయి, బంగ్లాదేశ్‌పై గెలవడంతో పాకిస్థాన్‌కు సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనుకున్నారు. కానీ ఆ టీమ్‌ నెదర్లాండ్స్‌తోపాటు పటిష్ఠమైన సౌతాఫ్రికా టీమ్‌ను కూడా ఓడించి మళ్లీ రేసులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఇండియా, పాకిస్థాన్‌, సౌతాఫ్రికాలలో సెమీస్‌ చేరే టీమ్స్‌ ఏవి అన్న ఆసక్తి నెలకొంది.

ఒక రకంగా పాకిస్థాన్‌తో పోలిస్తే ఇప్పటికీ ఇండియా, సౌతాఫ్రికాలకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రూప్‌ 2లో ఇండియా మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి టాప్‌లో ఉంది. ఇక సౌతాఫ్రికా 4 మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికాపై గెలిచిన పాకిస్థాన్‌ 4 పాయింట్లతో మూడోస్థానానికి వచ్చింది.

చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా సెమీస్‌కు..

ఇండియా తన చివరి మ్యాచ్‌ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా గ్రూప్‌ 2లో టాప్‌లో నిలిచి నేరుగా సెమీస్‌ చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం కష్టమే. అటు సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌ చేతుల్లో ఓడితేనే ఇండియాకు ఛాన్స్‌ ఉంటుంది. లేదంటే పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ విజయం కోసం ఎదురుచూడాలి.

ప్రస్తుతం ఇండియా కంటే పాకిస్థాన్‌ నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. అందువల్ల ఇండియా ఓడిపోయి, పాకిస్థాన్‌ గెలిస్తే చాలు ఆ టీమ్‌ సెమీస్‌ చేరుతుంది. ఒకవేళ జింబాబ్వేతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా ఇండియా సెమీస్‌ వెళ్తుంది. ఏడు పాయింట్లు అందుకునే అవకాశం పాకిస్థాన్‌కుగానీ, బంగ్లాదేశ్‌కుగానీ లేదు.

సౌతాఫ్రికా పరిస్థితి ఇదీ

ప్రస్తుతం సౌతాఫ్రికా ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. ఆ టీమ్‌ చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలిస్తే చాలు సెమీస్‌ వెళ్తుంది. ఒకవేళ నెదర్లాండ్స్‌ చేతుల్లో ఓడి, అటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ఫలితం వస్తే చాటు సౌతాఫ్రికా ఇంటికెళ్లిపోతుంది. ఇక వర్షం కారణంగా రద్దయితే మాత్రం నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది.

పాకిస్థాన్‌కు ఛాన్స్ ఉందా?

పాకిస్థాన్ సెమీస్‌ చేరాలంటే చివరి మ్యాచ్‌లో కచ్చితంగా బంగ్లాదేశ్‌ను ఓడించాలి. అదే సమయంలో నెదర్లాండ్స్‌ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోవడం లేదా మ్యాచ్ రద్దవడం జరగాలి. లేదంటే అటు జింబాబ్వే చేతుల్లో ఇండియా ఓడిపోయినా పాక్‌ సెమీస్‌ వెళ్తుంది. ఇండియా కంటే పాక్ నెట్‌ రన్‌రేట్‌ చాలా మెరుగ్గా ఉంది.

బంగ్లాదేశ్‌కీ అవకాశం ఉన్నా..

బంగ్లాదేశ్‌ కూడా సాంకేతికంగా సెమీస్‌ రేసులో ఉన్నా కూడా చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. ఆ టీమ్‌ నెట్‌ రన్‌రేట్‌ చాలా తక్కువగా ఉంది. చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచి, అటు నెదర్లాండ్స్‌ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోతే ఛాన్స్‌ ఉంటుంది. ఒకవేళ పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ గెలిచి, జింబాబ్వే చేతుల్లో ఇండియా ఓడినా.. ఇండియానే సెమీస్‌ చేరుతుంది. బంగ్లా కంటే ఇండియా నెట్‌ రన్‌రేట్‌ చాలా మెరుగ్గా ఉంది.