T20 Cricketer of the year Suryakumar: టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ సూర్యకుమార్
T20 Cricketer of the year Suryakumar: టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. గతేడాది ఈ ఫార్మాట్ లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.
T20 Cricketer of the year Suryakumar: సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి ఓ మెరుపులాగా వచ్చాడు. 2021లో జట్టులో అడుగుపెట్టిన అతడు.. 2022ను మరుపురానిదిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ గా ఎదిగాడు. ఒక కేలండర్ ఏడాదిలో టీ20ల్లో వెయ్యికిపైగా పరుగులు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు.
ట్రెండింగ్ వార్తలు
ఈ క్రమంలోనే గతేడాది టీ20ల్లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ను వెనక్కి నెట్టి ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్ వన్ అయ్యాడు. దీంతో సూర్యకుమార్ నే మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2022గా అనౌన్స్ చేసింది ఐసీసీ. ఈ విషయాన్ని బుధవారం (జనవరి 25) వెల్లడించింది. 2022లో సూర్యకుమార్ 31 టీ20లు ఆడి 46.56 సగటుతో 1164 రన్స్ చేశాడు.
అంతేకాదు గతేడాది అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 187.43గా ఉంది. ఈ ఫార్మాట్ లో గతేడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సూర్య నిలిచాడు. ఇక ఏడాదిలో టీ20ల్లో 68 సిక్స్ లు కూడా బాదాడు. మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ కూడా కావడం విశేషం. తనకు ఈ అవార్డు రావడంపై సూర్య స్పందించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది.
"ఇది చాలా గొప్ప అనుభూతిని ఇస్తోంది. 2022 నాకు చాలా అద్భుతమైన ఏడాది. ఆ ఏడాది నేను ఆడిన ఇన్నింగ్స్ లో నాకు కొన్ని బాగా నచ్చాయి. అందులో చాలా స్పెషల్ ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే దేశం తరఫున నేను చేసిన తొలి సెంచరీ. ఎందుకంటే తొలి సెంచరీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఇలాంటివి మరెన్నో ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ" అని సూర్య అన్నాడు.
2022లో సూర్య 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ లోనూ తొలి మ్యాచ్ విఫలమైనా.. తర్వాత బాగానే రాణించాడు. ఆ ఈవెంట్ లో సూర్య 239 రన్స్ చేశాడు. వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ టూర్ లోనూ టీ20ల్లో సెంచరీ చేశాడు. టీ20 కెరీర్లో సూర్య ఇప్పటి వరకూ 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తంగా 45 టీ20ల్లో 1578 రన్స్ చేశాడు.