Telugu News  /  Sports  /  Suryakumar Yadav Hit Hundred To Help India Get Huge Score Against Sri Lanka In 3rd T20i
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (AP)

India vs Sri Lanka 3rd T20I: 'సూర్య' ప్రతాపం.. లంక బౌలర్లను ఊచకోత.. భారత్ భారీ స్కోరు

07 January 2023, 20:56 ISTMaragani Govardhan
07 January 2023, 20:56 IST

India vs Sri Lanka 3rd T20I: రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో కదం తొక్కిన వేళ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది.

India vs Sri Lanka 3rd T20I: ఒకటా.. రెండా.. టీ20ల్లో మూడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 10 నెలల విరామంలో మూడో సెంచరీ చేసి తనేంటో నిరూపించాడు. అతడి దూకుడుకు శ్రీలంక బౌలర్లు చేతులెత్తేశారంటే అర్థం చేసుకోవచ్చు. 360 డిగ్రీల ప్లేయర్‌గా తనకున్న పేరును సార్థకం చేసుకుంటూ స్టేడియం నలువైపులా పరుగులు చేస్తూ అదరగొట్టాడు. ఫలితంగా శ్రీలంకపై టీమిండియా భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరంభంలో రాహుల్ త్రిపాఠి(35) అదరగొట్టగా.. అనంతరం సూర్యకుమార్ యాదవ్(112*) విధ్వంసం సృష్టించాడు.

ట్రెండింగ్ వార్తలు

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభమేమి దక్కలేదు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను(1) శ్రీలంక బౌలర్ మధుశనకా ఔట్ చేయడంతో భారత్ షాక్ తిన్నది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46) సాయంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఆరంభంలో వీరిద్దరూ బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడగా.. అనంతరం బ్యాట్ ఝుళిపించారు. రాహుల్ వచ్చి రావడంతోనే దూకుడుగా ఆడి స్కోరు వేగాన్ని పెంచాడు. 5 ఫోర్లు, 2 సిక్సర్ల సహా 16 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మరోప్కక్క శుబ్‌మన్ గిల్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ నిలకడగా ఆడాడు. వీరిద్దరూ భాగస్వామ్యం పలపడుతుందనుకున్న సమయంలో చమిక కరుణరత్నే రాహుల్ త్రిపాఠిని విడదీశాడు.

రాహుల్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో కుదురుకునేందుకు తక్కువ సమయమే తీసుకున్న అతడు.. వరుస పెట్టి బౌండరీలు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. శుబ్‌మన్ గిల్ సాయంతో స్కోరు వేగాన్ని పెంచాడు. లంక బౌలర్లనే లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాడు. ఎడా పెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ.. బౌలర్లను బెంబేలెత్తించాడు. అతడి ధాటికి ఎటు వైపు బౌలింగ్ చేయాలో కూడా లంక బౌలర్లకు అర్థం కాలేదు. తన ట్రేడ్ మార్కు బ్యాక్ షాట్‌ను పక్కకు వంగి పదే పదే కొడుతూ వారికి చుక్కలు చూపించారు. ఫీల్డర్‌ను పెట్టినా.. బంతిని బౌండరీ అవతలకు పంపిస్తూ బౌలర్లరు భయపెట్టాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

సెంచరీతో కదం తొక్కిన సూర్య..

అర్ధశతకం పూర్తయిన తర్వాత మరింత రెచ్చిపోయాడు సూర్యకుమార్. ప్రతి ఒక్కరి బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పరుగుల ప్రవాహం సృష్టించాడు. మరోపక్క శుబ్‌మన్ గిల్ అతడికి సహకరించడంతో వీరిద్దరూ వంద పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో అర్ధశతకానికి చేరువైన శుబ్‌మన్ హసరంగా వేసిన ఓ బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడు ఔటైన తర్వాత హార్దిక్ పాండ్య(4), దీపక్ హుడా(4) క్రీజులో వచ్చినప్పటికీ.. భారీ షాట్లకు ప్రయత్నించి వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ సూర్యకుమార్ మాత్రం పరుగుల వేగాన్ని మాత్రం తగ్గించలేదు. వికెట్లు పడుతున్నప్పటికీ అతడు బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లో 100 పరుగులు చేసిన సూర్యకుమార్ టీ20 కెరీర్‌లో మూడో శతకాన్ని నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో నాలుగు సెంచరీలతో రోహిత్ ముందున్నాడు.

చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ కూడా వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. 9 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఉన్నాయి. చివరి 2 ఓవర్లలో 28 పరుగులు వచ్చాయి. ఎట్టకేలకు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయిన టీమిండియా 228 పరుగులు భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మధుశంకా 2 వికెట్లు తీయగా.. రజితా, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.