ICC T20I Rankings: ఫస్ట్ ర్యాంక్ మిస్ చేసుకున్న సూర్యకుమార్.. కొద్దిలో అగ్రపీటం కోల్పోయిన ప్లేయర్
Suryakumar in ICC T20I Rankings: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొదటి స్థానంలో పాక్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ కొనసాగుతున్నాడు.
Suryakumar Yadav Position in ICC T20I Rankings: సూర్యకుమార్ యాదవ్ ఇటీవల జరిగన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ల్లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాడని అదంరూ ఊహించారు. అయితే పాయింట్లలో కొద్ది గ్యాప్ ఉండటంతో రెండో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. మొదటి స్థానంలో పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ కొనసాగుతున్నాడు.
సూర్యకుమార్ 838 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. అతడి కంటే 16 పాయింట్ల మెరుగ్గా ఉన్న మహమ్మద్ రిజ్వాన్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆరో టీ20లో విశ్రాంతి తీసుకోకపోవడంతో రిజ్వాన్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోపక్క సూర్యకుమార్ మంగళవారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో తక్కువ పరుగులకే వెనుదిరగడంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. దీంతో ఈ నెలలోనే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటి వీరిద్దరూ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకుంటారో లేదో వేచి చూడాలి.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 801 పాయింట్లతో 3వ ర్యాంకులో ఉన్నాడు. ఇటీవల కాలంలో బ్యాటింగ్‌లో విఫలమవుతున్న బాబర్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరగనున్న ట్రైసిరీస్‌లో సత్తాచాటి తన ర్యాంకును మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాడు. మరోపక్క దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్కక్రమ్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ ఐదో స్థానానికి చేరుకున్నాడు.
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో 108 పరుగులతో మెరుగ్గా ఆడి 3 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. సఫారీ ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా 8 స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకులో నిలిచాడు. మూడో టీ20లో అద్బుత శతకం సాధించిన రిలీ రసో 23 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 10 స్థానాలు మెరుగుపరచుకుని 29వ ర్యాంకులో చేరాడు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్-బ్యాటర్లు
1. మహమ్మద్ రిజ్వాన్(పాకిస్థాన్)- 854 పాయింట్లు
2. సూర్యకుమార్ యాదవ్(భారత్)- 838 పాయింట్లు
3. బాబర్ ఆజం(పాకిస్థాన్)- 801 పాయింట్లు
4. ఎయిడెన్ మార్కక్రమ్(సౌతాఫ్రికా)- 777 పాయింట్లు
5. డేవిడ్ మలన్(ఇంగ్లాండ్)- 733 పాయింట్లు
సంబంధిత కథనం