Telugu News  /  Sports  /  Suryakumar On Chahal Says He Is My Batting Coach In A Funny Conversation
హార్దిక్ పాండ్యాతో సూర్యకుమార్ యాదవ్
హార్దిక్ పాండ్యాతో సూర్యకుమార్ యాదవ్ (PTI)

Suryakumar on Chahal: చహల్ నా బ్యాటింగ్ కోచ్.. అన్నీ అతడే నేర్పిస్తాడు: సూర్య

30 January 2023, 12:52 ISTHari Prasad S
30 January 2023, 12:52 IST

Suryakumar on Chahal: చహల్ నా బ్యాటింగ్ కోచ్.. అన్నీ అతడే నేర్పిస్తాడని న్యూజిలాండ్ తో రెండో టీ20 తర్వాత సూర్యకుమార్ అనడం విశేషం. మ్యాచ్ తర్వాత చహల్, కుల్దీప్ లతో కలిసి సూర్య సరదాగా చాట్ చేసి సందర్భంగా ఈ ఫన్నీ కామెంట్స్ చేశాడు.

Suryakumar on Chahal: న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో క్రికెట్ ప్రపంచం ఓ కొత్త సూర్యకుమార్ ను చూసింది. ఇన్నాళ్లూ సూర్య అంటే 360 డిగ్రీ ప్లేయర్. బంతి పడితే చాలు అది బౌండరీ అవతల పడుతుందనే అనుకునే వారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అతడు తన ఆటతీరుకు పూర్తి విరుద్ధంగా ఆడాడు. 31 బాల్స్ లో 26 రన్స్ చేశాడు. కానీ టీమ్ విజయంలో ఈ పరుగులే అత్యధికం. పైగా కీలకంగా నిలిచాయి.

ట్రెండింగ్ వార్తలు

తన ఈ కొత్త బ్యాటింగ్ స్టైల్ పై మ్యాచ్ తర్వాత సూర్య స్పందించాడు. స్పిన్నర్లు కుల్చా (కుల్దీప్-చహల్)లతో కలిసి సరదాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడతడు. టీమ్ లో అందరితో సరదాగా ఉండే చహల్.. తనదైన రీతిలో సూర్యను ప్రశ్నలు అడిగాడు. వాటికి అతడు కూడా అంతే సరదాగా సమాధానాలు ఇచ్చాడు.

"మన మిస్టర్ 360 ఇవాళ చాలా కామ్ గా కనిపించాడు. అతనిలోని భిన్నమైన కోణాన్ని మనం ఇవాళ చూశాం. అతన్ని గత 11-12 ఏళ్లుగా చూస్తున్నా. సాధారణంగా 30 బాల్స్ లో 70 రన్స్ చేస్తాడు. కానీ ఇవాళ నీ మైండ్ సెట్ ఎలా ఉంది" అని సూర్యను చహల్ అడిగాడు. దీనికి సూర్య సమాధానమిస్తూ.. "నాపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. మ్యాచ్ ను చివరి వరకూ తీసుకెళ్తే గెలిపించవచ్చిన అనుకున్నాను. సుందర్ ఔటైన తర్వత హార్దిక్ తోనూ అదే చెప్పాను" అని చెప్పాడు.

అయితే చహల్ తర్వాత అడిగిన ప్రశ్నే అందరినీ నవ్వించింది. ఈ మ్యాచ్ కు ముందు తాను రంజీ ట్రోఫీలో ఆడిన వీడియో ఏమైనా చూశావా అని చహల్ ప్రశ్నించాడు. "నీకు 370 డిగ్రీల్లో ఆడటం నేర్పించాను. కానీ ఇది పూర్తిగా భిన్నమైన వికెట్. రంజీ ట్రోఫీలో నేను ఆడిన ఆట చూశావా" అని చహల్ అడిగాడు.

"నిజానికి నువ్వు నాకు గత సిరీస్ లో నేర్పించింది గుర్తు పెట్టుకున్నాను. నాకు ఇంకా బ్యాటింగ్ పాఠాలు నేర్పితే నేను మరింత మెరుగవుతాను. వ్యూయర్స్.. దీనిని జోక్ గా తీసుకోకండి. చహల్ నా బ్యాటింగ్ కోచ్. అతడు నాకు అన్నీ నేర్పిస్తాడు" అని సూర్య నవ్వుతూ చెప్పాడు.

ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్ లో షేర్ చేసింది. మూడు టీ20ల సిరీస్ లో రెండో మ్యాచ్ గెలిచిన టీమిండియా సిరీస్ ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం (ఫిబ్రవరి 1) అహ్మదాబాద్ లో జరగనుంది.