Suryakumar at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్
Suryakumar at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఇండియన్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. భార్యతో కలిసి వచ్చిన అతడు.. దర్శనం తర్వాత ఫొటోలను ట్విటర్ లో షేర్ చేసుకున్నాడు.
Suryakumar at Tirumala: ఆస్ట్రేలియాతో రెండో టెస్టును మూడు రోజుల్లోనే ముగించేసిన తర్వాత ఇండియన్ ప్లేయర్స్ కు కాస్త ఎక్కువ బ్రేక్ దొరికింది. మూడో టెస్టు ఇండోర్ లో మార్చి 1న ప్రారంభం కానుండగా.. ఈ గ్యాప్ లో ప్లేయర్సంతా తమ ప్రైవేటు పనుల్లో బిజీ అయ్యారు. మళ్లీ ఇండోర్ లో రిపోర్ట్ చేయడానికి ఫిబ్రవరి 25 వరకూ సమయం ఉండటంతో క్రికెటర్లు తమ కుటుంబాలతో కలిసి హాయిగా విహరిస్తున్నారు.
తాజాగా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ ఫొటోలను మంగళవారం (ఫిబ్రవరి 21) అతడు తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసుకున్నాడు. సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన సూర్య.. నుదుటను తిలకం పెట్టుకున్నాడు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఫొటోలను సూర్య ట్విటర్ లో పోస్ట్ చేశాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడిన సూర్య.. రెండో టెస్టు తుది జట్టులో చోటు కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో సూర్యకు అవకాశం దక్కలేదు. గతేడాది టీ20ల్లో అద్భుతమైన ఫామ్ కనబరచిన సూర్యకు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించారు. తొలి టెస్టులో శ్రేయస్ గాయపడటంతో అనుకోకుండా ఆడే అవకాశం లభించింది. అయితే అతడు ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు.
రెండో మ్యాచ్ కు శ్రేయస్ తిరిగి రావడంతో సూర్య తన స్థానం కోల్పోయాడు. ఇక ఇప్పుడు మూడో టెస్ట్ మార్చి 1న ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. నిజానికి ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉన్నా.. అక్కడ ఔట్ ఫీల్డ్ సరిగా లేకపోవడంతో ఇండోర్ కు తరలించారు. ఈ మ్యాచ్ లో టీమిండియా సిరీస్ పై కన్నేయనుంది. 4 టెస్టుల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఇండియన్ టీమ్.. ఇక సిరీస్ కోల్పోయే అవకాశమైతే లేదు.
మూడో టెస్ట్ కూడా గెలిస్తే సిరీస్ సొంతమవడంతోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ చోటు దక్కుతుంది. అటు ఆస్ట్రేలియా టీమ్ కు ఇప్పటికే వార్నర్, హేజిల్ వుడ్ గాయాల కారణంగా దూరమవడంతో ఆ టీమ్ మరింత బలహీనపడింది.
సంబంధిత కథనం