SS Rajamouli: క్రికెట్ స్కూల్స్ బోర్డు ‘ఐఎస్‍బీసీ’ గౌరవ చైర్మన్‍గా రాజమౌళి.. యువ క్రికెటర్ల కోసం టాలెంట్ హంట్-ss rajamouli becomes indian schools board for cricket honorable chairman talent hunt begins ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ss Rajamouli: క్రికెట్ స్కూల్స్ బోర్డు ‘ఐఎస్‍బీసీ’ గౌరవ చైర్మన్‍గా రాజమౌళి.. యువ క్రికెటర్ల కోసం టాలెంట్ హంట్

SS Rajamouli: క్రికెట్ స్కూల్స్ బోర్డు ‘ఐఎస్‍బీసీ’ గౌరవ చైర్మన్‍గా రాజమౌళి.. యువ క్రికెటర్ల కోసం టాలెంట్ హంట్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jul 01, 2023 05:53 PM IST

SS Rajamouli: ఐఎస్‍బీసీ గౌరవ చైర్మన్‍గా ఎంపికయ్యారు స్టార్ సినీ డైరెక్టర్ రాజమౌళి. కాగా, యువ క్రికెటర్ల కోసం ఐఎస్‍బీసీ టాలెంట్ హంట్ మొదలైంది. వివరాలివే..

ఎస్ఎస్ రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళి

SS Rajamouli: ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ISBC) గౌరవ చైర్మన్‍ పదవిని సినీ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేపట్టారు. పాఠశాలల స్థాయి నుంచి అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసేందుకు పని చేస్తున్న ఐఎస్‍బీసీలో గౌరవ చైర్మన్ పదవికి ఆయన ఎంపికయ్యారు. ఐఎస్‍బీసీ మూడంచెల క్రికెట్ పోటీలను నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరిలో భారత్‍లో స్కూల్స్ క్రికెట్ ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాజమౌళిని గౌరవ చైర్మన్‍గా ఐఎస్‍బీసీ ప్రకటించింది. శనివారం హైదరాబాద్‍లోని ఓ హోటల్‍లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాలను ఐఎస్‍బీసీ వ్యవస్థాపకడు, సీఈవో కొలనుపాక సునీల్ బాబు వెల్లడించారు. ఈ సమావేశంలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా మాట్లాడారు.

తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని రాజమౌళి చెప్పారు. స్కూల్‍లో, కాలేజీలో తాను క్రికెట్ ఆడేవాడినని తెలిపారు. ఏలూరులో కాలేజీలో చదువుతున్నప్పుడు క్రికెట్‍ టీమ్‍లో తాను ఆడానని గుర్తు చేసుకున్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ చాలా ఉందని, అయితే సరైన ప్లాట్‍ఫామ్ లేక చాలా మంది వెలుగులోకి రాలేకపోతున్నారని రాజమౌళి అన్నారు. క్రికెట్ అభివృద్ధి కోసం ఐఎస్‍బీసీ తనను సంప్రదించిందని, తాను అంగీకరించాని రాజమౌళి తెలిపారు. ఐఎస్‍బీసీ చీఫ్ ప్యాట్రన్‍గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎంపికయ్యారు. కాగా, రాజమౌళి కుమారుడు కార్తికేయ.. ఐఎస్‍బీసీకి ఇప్పటికే జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.

వచ్చే ఏడాది జనవరిలో స్కూల్స్ క్రికెట్ ప్రపంచకప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్‍లో 8 దేశాల జట్లు పోటీ పడనున్నాయి. దీని కంటే ముందు దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్, ఇండియన్ స్కూల్ టాలెంట్ లీగ్ (ISTL) జరగనున్నాయి. ఈ ఐఎస్‍టీఎల్‍లో 8 ఫ్రాంచైజీలు ఆడతాయి. ఈ లీగ్‍లో గెలిచిన జట్టు.. స్కూల్స్ ప్రపంచకప్‍లో భారత్‍ తరఫున ఆడుతుంది.

టాలెంట్ హంట్ వివరాలివే..

ఇండియన్ స్కూల్ టాలెంట్ లీగ్, ప్రాజెక్ట్ స్కూల్ ప్రపంచకప్ కోసం యువ ప్లేయర్లను ఎంపిక చేసేందుకు మెగా టాలెంట్ హంట్‍కు ఐఎస్‍బీసీ రెడీ అయంది. 12 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న యువ క్రికెటర్లు.. తమ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో కూడిన వీడియోలను ఐఎస్‍బీసీ వెబ్‍సైట్, ఐఎస్‍బీసీ యాప్‍లో అప్‍లోడ్ చేయాలి. ఈ వీడియో కనీసం 60 సెకన్ల నిడివి ఉండాలి. ఐఎస్‍బీసీ చీఫ్ మెంటార్ దిలీప్ వెంగ్‍సర్కార్ నేతృత్యంలోని ఎనలిస్టులు ఈ వీడియోలను పరిశీలించి ప్రతీ జిల్లా నుంచి 400 మంది యువ క్రికెటర్లను సెలెక్ట్ చేస్తారు. ఆ ఆటగాళ్లు జిల్లా స్థాయి క్రికెట్‍ పోటీలో ఆడవచ్చు.

Whats_app_banner