Srikkanth on Rishabh Pant: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ ఉండాల్సిందే!-srikkanth on rishabh pant says he is a match winner ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Srikkanth On Rishabh Pant Says He Is A Match Winner

Srikkanth on Rishabh Pant: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ ఉండాల్సిందే!

Hari Prasad S HT Telugu
Oct 31, 2022 04:06 PM IST

Srikkanth on Rishabh Pant: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ ఉండాల్సిందే అంటున్నారు టీమిండియా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు క్రిష్ణమాచారి శ్రీకాంత్‌, డేల్‌ స్టెయిన్‌. కార్తీక్‌ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో పంత్‌ను తీసుకోవాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

శ్రీకాంత్, టీమిండియా
శ్రీకాంత్, టీమిండియా (File photo/PTI)

Srikkanth on Rishabh Pant: రిషబ్‌ పంత్‌.. ఆస్ట్రేలియా కండిషన్స్‌లో అద్భుతంగా రాణించగల ప్లేయర్‌. గతంలోనూ ఎన్నోసార్లు అతడు నిరూపించాడు. ముఖ్యంగా రెండు టెస్ట్‌ సిరీస్‌ విజయాల్లో పంత్‌ పాత్ర ఎంతో కీలకం. అలాంటి ప్లేయర్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ ఇండియన్‌ టీమ్‌ తీసుకోలేదు. పంత్‌ కంటే ఎక్కువగా దినేష్‌ కార్తీక్‌నే నమ్ముతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్‌ నుంచి ఫినిషర్‌గా మారిన 37 ఏళ్ల కార్తీక్ తిరిగి ఇండియన్‌ టీమ్‌లోకి వచ్చి యువ వికెట్‌ కీపర్‌ పంత్‌ను వెనక్కి నెట్టి తాను తుది జట్టులో ఉంటున్నాడు. అతనిపై ఇండియన్‌ టీమ్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లలో కార్తీక్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ ఈ మెగాటోర్నీలో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఎంతో కీలకమైన సమయంలో 15 బంతులు ఆడి కేవలం 6 రన్స్‌ చేసి ఔటయ్యాడు. అంతకుముందు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ చివరి ఓవర్లో ఏదో అద్భుతం చేస్తాడనుకుంటే ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. దీంతో కార్తీక్‌ను తప్పించి రిషబ్ పంత్‌ను తీసుకోవాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. బంగ్లాదేశ్‌తో జరగబోయే తర్వాతి మ్యాచ్‌లో పంత్‌ కచ్చితంగా ఉండాల్సిందేనని పలువురు మాజీ క్రికెటర్లు కూడా చెబుతున్నారు.

నిజానికి కార్తీక్‌ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్‌ 15వ ఓవర్లో కార్తీక్‌ గాయపడ్డాడు. ఒకవేళ బంగ్లాతో మ్యాచ్‌ అతడు ఆడలేకపోతే పంత్‌నే తీసుకోవాలని మాజీ ఓపెనర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. అతడు నిలకడగా ఆడకపోయినా.. మ్యాచ్‌ విన్నర్‌ అని శ్రీకాంత్‌ కొనియాడాడు.

"అతన్ని తీసుకోవాల్సిందే. రిషబ్‌ పంత్‌ ఓ మ్యాచ్‌ విన్నర్‌. అతని నుంచి నిలకడ ఆశించవద్దు. పది ఇన్నింగ్స్‌లో అతడు మూడు ఆడినా.. ఆ మ్యాచ్‌లలో ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు" అని స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ శ్రీకాంత్‌ చెప్పాడు.

అటు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ డేల్‌ స్టెయిన్‌ కూడా పంత్‌ టీమ్‌లో ఉండాల్సిందేనని అన్నాడు. "వరల్డ్‌కప్‌లో అతడు ఆ పని చేయగలడు. రిషబ్‌ పంత్‌ మరోసారి తనను హీరోగా నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. బహుశా అతడు ఇలాంటి క్షణం కోసమే ఎదురు చూస్తుండవచ్చు" అని స్టెయిన్‌ అన్నాడు. సూపర్‌ 12 స్టేజ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన టీమిండియా.. నవంబర్‌ 2న బంగ్లాదేశ్‌తో అడిలైడ్‌లో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

WhatsApp channel