Srikkanth on KL Rahul: నేనతన్ని రోల్స్ రాయిస్ రాహుల్ అని పిలుస్తా.. కానీ ఇప్పుడు మాత్రం..: మాజీ ఛీఫ్ సెలక్టర్-srikkanth on kl rahul says he needs a break right now ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Srikkanth On Kl Rahul Says He Needs A Break Right Now

Srikkanth on KL Rahul: నేనతన్ని రోల్స్ రాయిస్ రాహుల్ అని పిలుస్తా.. కానీ ఇప్పుడు మాత్రం..: మాజీ ఛీఫ్ సెలక్టర్

Hari Prasad S HT Telugu
Feb 22, 2023 04:02 PM IST

Srikkanth on KL Rahul: నేనతన్ని రోల్స్ రాయిస్ రాహుల్ అని పిలుస్తా.. కానీ ఇప్పుడు మాత్రం అతన్ని టీమ్ లో నుంచి తప్పించాల్సిందేనని అన్నాడు మాజీ ఛీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్. ఇప్పుడు చర్చంతా రాహుల్ చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే.

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (REUTERS)

Srikkanth on KL Rahul: కేఎల్ రాహుల్.. తన ఏడు టెస్టు సెంచరీల్లో ఆరు స్వదేశం బయట చేసిన బ్యాటర్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంకలాంటి కఠినమైన పరిస్థితుల్లో వీటిని సాధించాడు. కానీ అలాంటి బ్యాటర్ ఇప్పుడు ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తనకు వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా వైస్ కెప్టెన్సీని కోల్పోయిన అతడు.. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో తుది జట్టులోనూ చోటు కోల్పోబోతున్నాడు. ఇప్పటి వరకూ 47 టెస్టులు ఆడిన రాహుల్ కేవలం 33.44 సగటుతో పరుగులు చేయడం చాలా మంది మాజీలకు మింగుడు పడటం లేదు. దీంతో అతన్ని కచ్చితంగా జట్టులో నుంచి తొలగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

గత పది టెస్టు ఇన్నింగ్స్ లో రాహుల్ సాధించిన అత్యధిక స్కోరు కేవలం 23 పరుగులు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కూడా రాహుల్ ఫామ్ పై స్పందించాడు. రాహుల్ కు ఉన్న క్లాస్ చూసి తాను అతన్ని రోల్స్ రాయిస్ రాహుల్ అని పిలుస్తానని, అయితే ఇప్పుడు మాత్రం అతని స్థానంలో గిల్ ను తీసుకోవడమే సరైనదని అనడం విశేషం.

"రాహుల్ క్లాస్ నాకెంతగానో నచ్చుతుంది. నిజానికి నేనతన్ని రోల్స్ రాయిస్ రాహుల్ అని పిలుస్తాను. కానీ ప్రస్తుతం అలాంటి క్లాస్ రాహుల్ దగ్గర కనిపించడం లేదు. ఒకవేళ నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయి ఉంటే మాత్రం నేను నేరుగా రాహుల్ దగ్గరికి వెళ్లి కాస్త బ్రేక్ తీసుకో అని చెప్పేవాడిని. రాహుల్ పై నాకు గౌరవం ఉంది. కానీ అతని స్థానంలో శుభ్‌మన్ ను ఆడించాల్సిన సమయం ఇది. లైఫ్ టైమ్ ఫామ్ లో ఉన్న ఓ ప్లేయర్ ను ఎక్కువ రోజులు ఇలా బెంచ్ పై కూర్చోబెట్టకూడదు" అని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

2011 వరల్డ్ కప్ గెలిచిన సమయంలో శ్రీకాంత్ ఇండియన్ టీమ్ సెలక్షన్ కమిటీ ఛీఫ్ గా ఉన్నాడు. 1983 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో శ్రీకాంత్ సభ్యుడు. ప్రస్తుతం రాహుల్ ఆటలో ఎలాంటి సాంకేతిక లోపాలను గుర్తించలేదని ఈ సందర్భంగా శ్రీకాంత్ స్పష్టం చేశాడు. "ప్రస్తుతానికి అతని ఆటలో సాంకేతికపరమైన లోపాన్ని గుర్తించలేదు. ఇది మానసికమైన విషయానికి సంబంధించినది. అతడు బ్రేక్ తీసుకొని తన మైండ్ ను క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత అతడు పూర్తి ఫామ్ తో మళ్లీ ఎందుకు రాడో నేనూ చూస్తాను" అని శ్రీకాంత్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం