Sreeja Akula: చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి శ్రీజ ఆకుల.. టేబుల్ టెన్నిస్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా..
Sreeja Akula: తెలుగమ్మాయి శ్రీజ ఆకుల చరిత్ర సృష్టించింది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె నిలవడం గమనార్హం.
Sreeja Akula: మన హైదరాబాదీ, తెలుగు తేజం శ్రీజ ఆకుల ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆదివారం (జూన్ 23) నైజీరియాలోని లాగోస్ లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచింది. గతంలో ఏ ఇండియన్ ప్లేయర్ కు సాధ్యం కాని రికార్డు ఇది. త్వరలో పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లబోతున్న శ్రీజకు ఈ విజయం మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేదే.
తొలి ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్
ఇండియన్ స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయిన శ్రీజ ఆకుల వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచింది. ఇలా సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె నిలిచింది. లాగోస్ లో జరిగిన ఈ ఫైనల్లో శ్రీజ.. చైనాకు చెందిన డింగ్ యిజీపై 4-1తో గెలిచింది. 10-12, 11-9, 11-6, 11-8, 11-6తో శ్రీజ విజయం సాధించింది.
సెమీఫైనల్లో మరో ఇండియన్ ప్లేయర్ సుతీర్థ ముఖర్జీపై 3-2తో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీజ.. అక్కడా అదే ఊపు కొనసాగించింది. ఇక మరో సెమీఫైనల్లో ఇండియాకే చెందిన ఐహికా ముఖర్జీ.. డింగ్ యిజీ చేతుల్లో 2-3తో ఓటమి పాలైంది. దీంతో శ్రీజ, డింగ్ యిజీ మధ్య ఫైనల్ జరిగింది. ఇందులో తొలి సెట్లోనే శ్రీజ ఓడిపోయి 0-1తో వెనుకబడింది.
తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఆమె.. వరుసగా నాలుగు సెట్లను సొంతం చేసుకొని టైటిల్ ఎగరేసుకుపోయింది. అంతకుముందు వుమెన్స్ డబుల్స్ టైటిల్ కూడా శ్రీజ సొంతమైంది. అర్చన గిరీష్ కామత్ తో కలిసి ఆడిన శ్రీజ.. ఫైనల్లో యశస్విని, దియా పరాగ్ జోడీపై 3-0తో గెలిచారు. ఒలింపిక్స్ లోనూ వుమెన్స్ డబుల్స్ లో ఈ ఇద్దరే కలిసి బరిలోకి దిగుతున్నారు.
ఫైనల్లో శ్రీజ, అర్చన జోడీ 11-9, 11-6, 12-10తో గెలిచింది. ఇక సెమీఫైనల్లోనూ మరో ఇండియన్ జోడీ ఐహిక, సుతీర్థ ముఖర్జీ జోడీపైనా 3-0తో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. ఇక ఫైనల్లోనూ గెలిచి డబుల్స్ టైటిల్ ఎగరేసుకుపోయారు. ఆ తర్వాత సింగిల్స్ టైటిల్ కూడా గెలిచి శ్రీజ సరికొత్త చరిత్ర సృష్టించింది.