Telugu News  /  Sports  /  Spider Cam Knocks Down Fielder In Australia Vs South Africa Boxing Day Test
స్పైడర్ కెమెరా ఢీకొట్టడంతో కింద పడిపోయిన సౌతాఫ్రికా ఫీల్డర్ నోక్యా
స్పైడర్ కెమెరా ఢీకొట్టడంతో కింద పడిపోయిన సౌతాఫ్రికా ఫీల్డర్ నోక్యా (AP)

Spider Cam Knocks down fielder: ఫీల్డర్‌ను ఢీకొట్టిన స్పైడర్‌ కెమెరా.. బాక్సింగ్ డే టెస్ట్‌లో షాకింగ్‌ ఘటన

27 December 2022, 12:32 ISTHari Prasad S
27 December 2022, 12:32 IST

Spider Cam Knocks down fielder: ఫీల్డర్‌ను ఢీకొట్టింది స్పైడర్‌ కెమెరా. ఈ షాకింగ్‌ ఘటన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో కనిపించింది.

Spider Cam Knocks down fielder: క్రికెట్‌ను టీవీల్లో చూసే వారికి ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతిని కలిగించడానికి బ్రాడ్‌కాస్టర్లు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందులో భాగంగా వచ్చిందే స్పైడర్‌ కెమెరా. క్రికెట్ గ్రౌండ్‌ పైన ఓ తాడు సాయంతో వేలాడుతూ.. అప్పుడప్పుడూ కిందికి వస్తూ, చుట్టూ తిరుగుతూ ఫీల్డ్‌లో జరుగుతున్న యాక్షన్‌ను సరికొత్తగా క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అందిస్తుందీ కెమెరా.

ట్రెండింగ్ వార్తలు

గతంలో ఈ కెమెరాకు బంతి తగిలి క్యాచ్‌లు మిస్సయిన ఘటనలు చాలానే చూశాం. అయితే తొలిసారి ఫీల్డ్‌లో చాలా వేగంగా కదులుతున్న ఈ కెమెరా ఓ ఫీల్డర్‌ను ఢీకొట్టింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్ట్‌ రెండో రోజు ఈ ఘటన జరిగింది. సౌతాఫ్రికా ఫీల్డర్‌ ఆన్రిచ్‌ నోక్యా నడుస్తూ వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన స్పైడర్‌ కెమెరా బలంగా ఢీకొడుతూ వెళ్లిపోయింది.

కెమెరా తగలగానే కింద పడిపోయిన నోక్యా.. ఈ ఊహించని ఘటనతో షాక్‌ తిన్నాడు. బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న నోక్యా తన స్థానంలోకి నడుస్తూ వెళ్తుండగా ఫాక్స్‌ స్పోర్ట్స్‌కు చెందిన ఫ్లయింగ్‌ ఫాక్స్ కెమెరా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చింది. అతన్ని ఢీకొడుతూ అలా ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన ఆ స్పైడర్‌ క్యామ్‌లోనూ రికార్డు కావడం విశేషం.

అయితే దీని నుంచి వెంటనే కోలుకున్న నోక్యా లేచి నిల్చున్నాడు. పెద్దగా గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వింత ఘటనతో ఫీల్డ్‌ ఉన్న ప్లేయర్స్‌ అంతా షాక్ తిన్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ వెంటనే నోక్యా దగ్గరికి వెళ్లి అతని పరిస్థితిని ఆరా తీశాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు లంచ్‌ తర్వాత ఈ ఘటన జరిగింది.

టీ20 క్రికెట్‌ వచ్చిన తర్వాత స్పైడర్‌ కెమెరాతోపాటు డ్రోన్‌ కెమెరాల వినియోగం కూడా పెరిగింది. స్పైడర్‌ కెమెరాలు తరచూ ఆటకు అంతరాయం కలిగిస్తూనే ఉన్నాయి. అయితే ఇలా ఓ ప్లేయర్‌నే ఢీకొట్టిన ఘటన మాత్రం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.