India vs South Africa 1st ODI: ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం.. సంజూ శాంసన్ ఒంటరి పోరాటం-south africa won by 9runs against india in 1st odi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  South Africa Won By 9runs Against India In 1st Odi

India vs South Africa 1st ODI: ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం.. సంజూ శాంసన్ ఒంటరి పోరాటం

Maragani Govardhan HT Telugu
Oct 06, 2022 11:07 PM IST

India vs South Africa: లక్నో వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు భారత బ్యాటర్ సంజూ శాంసన్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు.

సంజూ శాంసన్
సంజూ శాంసన్ (PTI)

India vs South Africa 1st ODI: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. 250 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్.. పోరాడి ఓడింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 249 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులే చేయగలిగింది. ఫలితంగా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్(86), శ్రేయాస్(50) అర్ధశతకాలు వృథా అయ్యాయి. సంజూ శాంసన్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. రబాడా 2 వికెట్లతో రాణించాడు.

ట్రెండింగ్ వార్తలు

250 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభమేమి దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను(3) రబాడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే కెప్టెన్ ధావన్‌ను(4) పార్నెల్ పెవిలియన్ చేర్చాడు. ఇలాంటి సమయంలో రుజురాజ్ గైక్వాడ్(19), ఇషాన్ కిషన్(20) ఇన్నింగ్స్ నడిపే ప్రయత్నం చేసేనప్పిటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. తొలుత రుతురాజ్‌ను షమ్సీ ఔట్ చేయగా.. ఆ కాసేపటికే ఇషాన్‌ను కేశవ్ మహారాజ్ వెనక్కి పంపాడు. ఫలితంగా 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది టీమిండియా.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ ఆదుకునే ప్రయత్నించారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచారు. దూకుడుగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే ఎంగిడి బౌలింగ్‌లో రబాడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా వీరిద్దరి 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇలాంటి సమయంలో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శార్దూల్ ఠాకూర్ సాయంతో స్కోరు వేగాన్ని పెంచారు.

చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ.. వీరిద్దరూ నిలకడగా ఆడారు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఒకానొక దశలో మ్యాచ్ టీమిండియా వైపు తిరిగింది.అయితే చివర్లో వెంట వెంటనే వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు అవసరం కాగా.. 36 పరుగులే వచ్చాయి. శార్దూల్(33), ఆవేశ్ ఖాన్(3), కుల్దీప్ యాదవ్(0) వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది టీమిండియా. ఆఖరు ఓవర్‌కు 30 పరుగులు అవసరం కాగా.. సంజూ శాంసన్ ఓ సిక్సర్ సహా రెండు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. మూడు బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా.. తర్వాతి బంతి డాట్ బాల్‌ కాగా.. చివరి రెండు బంతులకు ఐదు పరుగులే వచ్చాయి. ఫలితంగా 9 పరుగుల తేడాతో భారత్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది సౌతాఫ్రికా. సఫారీ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(74*), డేవిడ్ మిల్లర్(75*) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. ఓపెనర్ డికాక్ రాణించాడు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా.. రవి భిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం