South Africa Coaches: క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు వచ్చిన తర్వాత టెస్ట్, వైట్‌బాల్ క్రికెట్ కోసం వేర్వేరు టీమ్స్‌ను ప్రకటించడం మనం చాన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే టెస్ట్, వైట్‌బాల్ టీమ్స్‌కు వేర్వేరు కోచ్‌లు అన్న కాన్సెప్ట్ మాత్రం అరుదైన విషయమే. ఇప్పుడు సౌతాఫ్రికా టీమ్ అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇద్దరు వేర్వేరు కోచ్‌లను నియమించినట్లు సోమవారం (జనవరి 16) వెల్లడించింది.,వైట్ బాల్ క్రికెట్ టీమ్‌కు రాబ్ వాల్టర్‌ను, టెస్ట్ టీమ్ కోసం షుక్రి కాన్రాడ్‌ను హెడ్ కోచ్‌లుగా నియమించారు. రాబ్ వాల్టర్ గతంలో సౌతాఫ్రికా టీమ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేశాడు. అయితే గత ఏడేళ్లుగా న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌గా ఉన్నాడు. మరోవైపు కాన్రాడ్ చాలా రోజులుగా సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌గా ఉన్నాడు. ఈ మధ్యే సౌతాఫ్రికా అండర్19 టీమ్‌కు కూడా కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది.,అయితే కాన్రాడ్‌కు ఈ ఏడాది పెద్దగా పని లేదనే చెప్పాలి. 2023లో సౌతాఫ్రికా టీమ్ మరో మూడు టెస్టులు మాత్రమే ఆడనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో స్వదేశంలో రెండు టెస్ట్‌ల సిరీస్ ఉంది. ఈ ఇద్దరు కోచ్‌లు ఫిబ్రవరి 1 నుంచి తమ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతానికి ఇంగ్లండ్‌తో జనవరి 27 నుంచి ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్ కోసం తాత్కాలిక కోచ్‌ను నియమించనున్నారు.,సౌతాఫ్రికా టీమ్‌కు గతేడాది వరకూ ఆ దేశ మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ హెడ్ కోచ్‌గా ఉండేవాడు. అయితే టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఆ పదవి నుంచి బౌచర్ తప్పుకున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు.