Team India: “సెలెక్టర్లు ఫూల్స్ కాదు.. అందుకే సర్ఫరాజ్‍ను టీమిండియాలోకి తీసుకోలేదు”: బీసీసీఐ అధికారి
Team India - Sarfaraz Khan: దేశవాళీ క్రికెట్‍లో అద్భుతంగా ఆడుతున్నా.. సర్ఫరాజ్ ఖాన్‍ను భారత టెస్టు జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదో బీసీసీఐకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. వివరాలివే..
Team India: వెస్టిండీస్ పర్యనటలో టెస్టు సిరీస్ కోసం భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్‍ను తీసుకోకవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో సుమారు 80 యావరేజ్‍తో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‍ను టీమిండియా టెస్టు జట్టులోకి ఎందుకు తీసుకోలేదని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ సహా మరికొందరు మాజీలు.. బీసీసీఐ, సెలెక్షన్ కమిటీని ప్రశ్నించారు. సర్ఫరాజ్‍ను విస్మరించి రంజీల్లో అతడి కంటే తక్కువ యావరేజ్ ఉన్న రుతురాజ్ గైక్వాడ్‍ను టెస్టులకు ఎలా తీసుకున్నారని విమర్శించారు. అయితే, ఈ విషయాలపై బీసీసీఐకు చెందిన ఓ అధికారి తాజాగా స్పందించారు. సర్ఫరాజ్‍ను టీమిండియాలో ఎందుకు తీసుకోలేదో వెల్లడించారు.
టీమిండియా టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్‍ను తీసుకోకపోవడానికి కారణాలను న్యూస్ ఏజెన్సీ పీటీఐకు చెప్పారు బీసీసీఐకు చెందిన ఓ అధికారి. “సర్ఫరాజ్ కోపాన్ని ప్రదర్శించడాన్ని అర్థం చేసుకుంటున్నాం. అయితే, అతడిని తీసుకోకపోవడానికి ఆట కాకుండా మరికొన్ని కారణాలు ఉన్నాయి. వరుస సీజన్లలో 900 పరుగులు చేసిన ఆటగాడిని పరిగణనలోకి తీసుకోకపోవడానికి సెలెక్టర్లు ఏమైనా మూర్ఖులా (ఫూల్)?. అతడి (సర్ఫరాజ్) ఫిట్‍నెస్ లెవెల్స్.. అంతర్జాతీయ క్రికెట్‍కు తగ్గట్టుగా లేవు. అతడిని ఎంపిక చేయకపోవడానికి అది ఓ కారణంగా ఉంది” అని ఆ అధికారి పేర్కొన్నారు. అలాగే మరో కారణాన్ని కూడా చెప్పారు.
“అతడు ఫిట్‍నెస్ కోసం మరింత కష్టపడాలి. బరువు తగ్గాలి. మరింత ఫిట్‍గా మారాలి. జట్టుకు ఎంపిక చేసేందుకు అర్హత బ్యాటింగ్‍ను మాత్రమే కాదు.. ఫిట్‍నెస్‍ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు” అని ఆ అధికారి వెల్లడించారు. అలాగే, మైదానంలోపల, బయట సర్ఫరాజ్ ప్రవర్తన కూడా అంత అత్యుత్తమంగా లేదని ఆ అఫీషియల్ పేర్కొన్నారు.
“మైదానంలో, వెలుపల కూడా అతడి ప్రవర్తన.. పూర్తిస్థాయి అత్యుత్తమంగా లేదు. కొన్ని సంఘటనలు, కొన్ని సంజ్ఞలను నోట్ చేసుకోవాల్సి వస్తుంది. మరికాస్త క్రమశిక్షణగా వ్యవహిస్తే అతడికే మంచి జరుగుతుంది. సర్ఫరాజ్, అతడి తండ్రి, కోచ్ ఈ విషయంపై దృష్టిసారిస్తారని ఆశిస్తున్నా” అని ఆ బీసీసీఐ అధికారి చెప్పారు.
ఈ ఏడాది మొదట్లో రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‍లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ సెంచరీ కొట్టాక కాస్త దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఆ సమయంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ స్టేడియంలోనే ఉన్నాడు. అలాగే, కొన్ని మ్యాచ్‍ల్లో సెంచరీలు చేసిన తర్వాత కూడా అతడు చాలా అగ్రెషన్‍గా సంబరాలు చేసుకున్నాడు.
కాగా, చివరి మూడు రంజీ సీజన్లలో ముంబై తరఫున 2,566 పరుగులతో అద్భుతంగా రాణించాడు సర్ఫరాజ్. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో సుమారు 80 యావరేజ్‍తో 3,350కుపైగా పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 301 (నాటౌట్)గా ఉంది. దీంతో ఇంత అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్‍ను టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.
తదుపరి వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న మొదలయ్యే టెస్టు సిరీస్ ఈ టూర్ ప్రారంభం కానుంది.
సంబంధిత కథనం