Indonesia Open: చరిత్ర సృష్టించిన సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి
Satwiksairaj Rankireddy - Chirag Shetty: భారత షట్లర్లు సాత్విక్‍సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి.. ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్స్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకున్నారు.
Satwiksairaj Rankireddy - Chirag Shetty: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సాత్విక్‍సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సాత్విక్ - చిరాగ్ ద్వయం ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్‍ను కైవసం చేసుకుంది. దీంతో, ప్రతిష్టాత్మక సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్‍ను దక్కించుకున్న తొలి భారత ద్వయంగా సాత్విక్ - చిరాగ్ శెట్టి జోడీ చరిత్ర సృష్టించింది. వివరాలివే..
జకార్తాలో ఆదివారం (జూన్ 18) జరిగిన ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్‍లో సాత్విక్‍సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీ 21-17, 21-18 తేడాతో మలేషియా ద్వయం ఆరోన్ చియా - సో వూజ్ ఇకాపై సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‍లో సాత్విక్, చిరాగ్ చెలరేగి ఆడి ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‍గా ఉన్న మలేషియా ద్వయాన్ని సాత్విక్ - చిరాగ్ కేవలం 43 నిమిషాల్లోనే ఓడించారు. వరుస గేమ్‍ల్లోనే మ్యాచ్‍ను కైవసం చేసుకున్నారు. టైటిల్ దక్కించుకున్నారు.
సాత్విక్ - చిరాగ్.. బర్మింగ్‍హామ్ కామన్‍వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం పతకం, గతేడాది ప్రపంచ చాంపియన్‍షిప్‍లో కాంస్యం సాధించారు. ఆసియా చాంపియన్లుగానూ సాత్విక్, చిరాగ్ ఉన్నారు. స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్ టైటిళ్లను కూడా గతంలో కలిసి కైవసం చేసుకున్నారు. తాజాగా ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు.
సాత్విక్ - చిరాగ్‍ను అభినందిస్తూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. ఆ ఇద్దరూ మళ్లీ చరిత్ర సృష్టించారంటూ ప్రశంసించారు. అద్భుతంగా ఆడారంటూ కొనియాడారు.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఆరు లెవెల్స్‌గా ఉంటుంది. వరల్డ్ టూర్ ఫైనల్స్, ఫోర్ సూపర్ 1000, సిక్స్ సూపర్ 750, సెవెన్ సూపర్ 500, 11 సూపర్ 300, సూపర్ 100 ఉంటాయి. వీటికి విభిన్నమైన ర్యాంకింగ్ పాయింట్స్, ప్రైజ్ మనీ ఉంటాయి. ఈ అన్ని టోర్నీల్లో సూపర్ 1000 లెవెల్ అత్యధిక పాయింట్లు, ప్రైజ్ మనీతో ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో సూపర్ 1000 టోర్నీలు అత్యున్నత టోర్నీలుగా ఉన్నాయి.