SRH vs RR: చెలరేగిన శాంసన్, బట్లర్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం-sanju samson hit to help rajasthan royals huge target against sunrisers hyderabad ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Sanju Samson Hit To Help Rajasthan Royals Huge Target Against Sunrisers Hyderabad

SRH vs RR: చెలరేగిన శాంసన్, బట్లర్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

Maragani Govardhan HT Telugu
Apr 02, 2023 05:29 PM IST

SRH vs RR: హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జాస్ బట్లర్, సంజూ శాంసన్, యశస్వి అర్ధశతకాలతో రాణించారు.

రాజస్థాన్-హైదరాబాద్
రాజస్థాన్-హైదరాబాద్ (PTI)

SRH vs RR: ఐపీఎల్ 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. భారీగా పరుగులు సమర్పించుకుంది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లు సంజూ శాంసన్(55), జోస్ బట్లర్(54), యశస్వి జైస్వాల్(54) అర్ధ శతకాలతో చెలరేగి హైదరాబాద్ నుంచి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో ఫజాల్ హఖ్ ఫరూఖి, నటరాజన్ చెరో 2 వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్.. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లనే లక్ష్యంగా చేసుకుని చెలరేగారు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో ముందుగా బట్లర్ అర్ధశతకం సాధించాడు. 22 బంతుల్లో 54 పరుగులు చేసిన బట్లర్ అద్భుతంగా రాణించాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దూకుడుగా ఆడుతున్న బట్లర్‌ను బౌల్డ్ చేసి హైదరాబాద్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు ఫరూఖి.

బట్లర్ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్.. యశస్వి సాయంతో స్కోరు వేగాన్ని మరింత పెంచాడు.

సంజూ శాంసన్ ధాటిగా బ్యాటింగ్ చేయగా.. అతడికి తోడు యశస్వి కూడా బ్యాట్ ఝూళింపించాడు. ఇదే క్రమంలో యశస్వి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు ఉన్నాయి. ధాటిగా ఆడటం ప్రారంభించిన యశస్విని ఫరూఖీ ఔట్ చేయడంతో 54 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. యశస్వి ఔటైన తర్వాత సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చెత్త బంతులను స్టాండ్స్‌లోకి పంపిస్తూ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఇదే కమ్రంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 సిక్సర్లు 3 ఫోర్లు ఉన్నాయి. అర్ధశతకం తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో నటరాజన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(2), రియాన్ పరాగ్(7) హైదరాబాద్ బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఫలితంగా చివరి రెండు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే రాబట్టింది రాజస్థాన్. ఆఖరు ఓవర్లో హిట్మైర్ ఫోర్ కొట్టడంటో రాజస్థాన్ 200 పరుగుల మార్కును అధిగమించింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరును సాధించింది రాజస్థాన్.

WhatsApp channel