Sanjay Bangar on Rohit: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో విజయం కోసం భారత్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేకాకుండా టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకంగా మారనుంది. ఎందుకంటే అతడు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. పూర్తి స్థాయి టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. కాబట్టి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా చూస్తుంటాడని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు.
"ఈ సిరీస్ రోహిత్ శర్మకు భారీ సిరీస్. 2015 నుంచి 2018 వరకు గాయాల కారణంగా చాలా టెస్టులకు దూరంగా ఉన్నాడు. 2018లో బాగా బ్యాటింగ్ చేస్తున్న దశలో వ్యక్తిగత కారణాల వల్ల అతడు తన కుటుంబంతో కలిసి స్వదేశానికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ సిరీస్ అతడికి భారీ సిరీస్." అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు.
"టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా ఇంగ్లాండ్ పరిస్థితులను ఎదుర్కొన్న అతడు ఇప్పటికే తన మనస్సును ఆ దిశగా సిద్ధపరచుకున్నాడు. భారత్‌లో ఇంగ్లాండ్‌పై ఎంతో అద్భుతమైన ఫామ్‌ను కలిగి ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా ఈ సిరీస్‌లో భారత్‌ను అగ్రస్థానంలో నిలుపుతాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కెప్టెన్‌గా బాగా రాణించడమే అతడు బాగా చేయాల్సిన పని." అని సంజయ్ బంగర్ స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. తొలిసారిగా టీమిండియాకు పూర్తి స్థాయి టెస్టు సిరీస్‌కు నేతృత్వం వహించనున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత 2 టెస్టులు మాత్రమే ఆడాడు. మిగిలిన మూడు టెస్టులకు గాయం కారణంగా దూరమయ్యాడు. 2021లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు టెస్టుల్లో ఓ సెంటరీ, ఓ అర్థశతకం సహా 345 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా లాంటి స్టార్ బ్యాటర్లు సైతం విఫలమైన పిచ్‌లపై అతడు బాగా ఆడాడు. స్వదేశంలో అతడికి మంచి రికార్డు ఉంది. ఇక్కడ మొత్తం 20 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ 70కి పైగా సగటుతో 1760 పరుగులు చేశాడు.