Salman Butt on Rahul Dravid: కాంబినేషన్లు తర్వాత.. ముందు సిరీస్ గెలవండి.. ద్రవిడ్‌పై పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు
Salman Butt on Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాక్ మాజీ ఆటగాడు సల్మాన బట్ విరుచుకుపడ్డాడు. వరల్డ్ కప్ కోసం తమ వద్ద విభిన్న కాంబినేషన్లు ఉన్నాయని చెప్పిన ద్రవిడ్.. ముందు ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడంపై దృష్టిపెట్టాలని స్పష్టం చేశాడు.
Salman Butt on Rahul Dravid: ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు టీమిండియా సిద్ధమవుతోంది. చెన్నై వేదికగా బుధవారం నాడు జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. దీంతో గత మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన రోహిత్ సేన.. చివరి వన్డేలో నెగ్గి సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇదిలా ఉంటే రెండో వన్డే పరాజయం గురించి స్పందించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. వరల్డ్ కప్ సన్నాహాల గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ప్రపంచకప్‌నకు సంబంధించి ఇప్పటికే జట్టును ఎంపిక చేసినట్లు స్పష్టం చేశామని, మెగా టోర్నీ కోసం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
"వన్డే ప్రపంచకప్ కోసం 17 నుంచి 18 మంది ప్లేయర్లను ఇప్పటికే ఎంపిక చేశాం. మెగా టోర్నీ ఇంకో ఆరు నెలలే ఉండటంతో కోర్ టీమ్ ప్లేయర్స్‌కే ఎక్కువగా అవకాశాలు ఇవ్వనున్నాం. మాకు ఇప్పుడు విభిన్నమైన ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్లు ఉన్నాయి. ప్రపంచకప్‌లో ఏ కాంబినేషన్‌లో అడినా ఆశ్చర్యపోనక్కర్లేదు." అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.
అయితే ద్రవిడ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజి ఆటగాడు సల్మాన్ బట్ మండిపడ్డాడు. వీలుచిక్కినప్పుడల్లా ద్రవిడ్‌ను విమర్శించే సల్మాన్ బట్.. ఈ సారి తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ముందు ఆసీస్‌తో సిరీస్ గెలిచే పని చూడాలని, కాంబినేషన్ల గురించి తర్వాత ఆలోచించవచ్చని స్పష్టం చేశాడు.
"విభిన్న కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని రాహుల్ ద్రవిడ్ అంటున్నారు. ముందు సిరీస్ గెలవండి! ఆ తర్వాత కాంబినేషన్ల గురించి ఆలోచించవచ్చు. అసలు అది ఇప్పుడు అసంబద్ధం. ముందుగా మీరు మీ బ్యాటింగ్ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడండి. టీమ్ కాంబినేషన్ల గురించిన చర్చ గందరగోళానికి దారితీస్తుంది." అని తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా సల్మాన్ బట్.. రాహుల్ ద్రవిడ్‌పై మండిపడ్డాడు.
"ఈ సమయంలో ఏది మాట్లాడిన ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో వన్డే గురించే ఉండాలి. అలాగే ఆ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. మ్యాచ్‌తో సంబంధం లేకుండా కాంబినేషన్ల గురించి మాట్లాడటం సరికాదు. తరచూ ఈ విధంగా జరగకూడదు." అని సల్మాన్ బట్ తెలిపాడు.