Sachin Tendulkar: ఇద్దరు దిగ్గజాలు ఒకే చోట.. సోబర్స్‌ను కలిసి సచిన్
టీమిండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్.. మరో లెజెండరీ క్రికెటర్‌ను కలుసుకున్నారు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు సర్ గ్యారీ పీల్డ్ సోబర్స్‌ను కలిసి ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇంగ్లాండ్-భారత్ మధ్య గురువారం జరిగిన రెండో వన్డే చూసేందుకు టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా హాజరయ్యారు. వీరిలో సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా తదితరులు విచ్చేశారు. మ్యాచ్‌ను విజయంతో ముగిస్తారనుకుంటే 100 పరుగుల తేడాతో పరాజయంతో ముగించింది భారత్. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు 1-1 తేడాతో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ అనంతరం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ అరుదైన ఫొటోను షేర్ చేశారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ గారీఫీల్డ్ సోబర్స్‌తో దిగిన చిత్రాన్ని షేర్ చేశారు.
"లార్డ్స్‌లో మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన దిగ్గజ క్రికెటర్ సర్ గ్యారీని కలిశాను. ఇది నాకు స్పెషల్ మూమెంట్" అంటూ సచిన్ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు.
వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్.. అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే బెస్ట్ ఆల్‌రౌండర్‌గా ఘనత సాధించారు. విండీస్ తరఫున సోబర్స్ 93 టెస్టులు, ఓ వన్డేకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 8032 పరుగులు, 235 వికెట్లు పడగొట్టారు. అయితే ఆయన ఆడిన ఒక్క వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో మాత్రం ఓ వికెట్ తీశారు.
మరోపక్క తెందూల్కర్ గురించి మాట్లాడితే టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. టెస్టుల్లో 15,921 పరుగులు చేయగా.. వన్డేల్లో 18,246 పరుగులు చేశారు. అంతేకాకుండా వన్డేల్లో తొలి సారి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. 2013లో వాంఖడే వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు.
గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 100 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్రధాన బ్యాట్స్ మెన్స్ విఫలం కావడంలో భారత్ కు ఓటమి తప్పలేదు.ఇంగ్లాండ్ పేసర్ టోప్లే 24 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశాడు. విల్లే, కార్స్, మెయిన్ అలీ, లివింగ్ స్టోన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 246 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.
సంబంధిత కథనం
టాపిక్