Telugu News  /  Sports  /  Saba Karim Says If India Wants Huge Scores In Odi Then No Place For Dhawan
శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ (ANI)

Saba Karim About Dhawan: వన్డేల్లో 325-350 స్కోర్లు చేయాలంటే ధావన్ ఉండకూడదు.. భారత మాజీ షాకింగ్ కామెంట్స్

12 December 2022, 13:35 ISTMaragani Govardhan
12 December 2022, 13:35 IST

Saba Karim About Dhawan: టీమిండియా మాజీ సబా కరీమ్ శిఖర్ ధావన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో భారత్ 325-350 స్కోర్లు చేయాలంటే జట్టులో శిఖర్ ధావన్ ఉండకూడదని స్పష్టం చేశాడు.

Saba Karim About Dhawan: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పదే పదే విఫలమవడం, ఇదే సమయంలో యువ ఆటగాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తుండటంతో జట్టుతో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధావన్ ఘోరంగా విఫలం కాగా.. రోహిత్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన ఇషాన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా అద్భుతమైన డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో గబ్బర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అతడి ప్రదర్శనపై భారత మాజీ సబా కరీమ్ స్పందించారు. భారత్ వన్డేల్లో 325-350 మధ్య పరుగులు చేయాలనుకుంటే జట్టులో శిఖర్ ధావన్ ఉండకూడదని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

"శిఖర్ ధావన్ జట్టులో ఉండాలా లేదా అనేది టీమ్ మేనేజ్మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. వారు ఏ విధానాన్ని ఎంచుకుంటారో చూడాలి. మేనేజ్మెంట్ 275 నుంచి 300 పరుగుల లక్ష్యం చాలనుకుంటే ధావన్‌ను ఆడించవచ్చు. ఎందుకంటే అతడు ఆ స్థాయిలోనే ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో అతడు పరుగులు చేయలేకపోయాడనేది వేరే విషయం. కానీ మీరు అతనికి మళ్లీ అవకాశం ఇస్తే మాత్రం స్కోర్ 275 నుంచి 300 మధ్యే ఉంటుంది. శిఖర్ ధావన్ స్థానం బహుశా ప్రపంచ కప్ వరకు ఉండవ్చు. అయితే 325 నుంచి 350 మధ్య స్కోరు కావాలంటే అతడికి చోటు ఉండదు." అని సబా కరీమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ధావన్ స్ట్రైక్ రేటు గురించి సబా కరీమ్ బోల్డ్ కామెంట్ చేశారు. అతడి నుంచి దూకుడైన ఆటను ఆశించట్లేదని స్పష్టం చేశారు. "ఈ విషయంలో సెలక్టర్లు, జట్టు మేనేజ్మెంట్, కెప్టెన్ ఎలాంటి అంచనాలు కలిగి ఉన్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది. 350 పరుగుల గేమ్‌లో శిఖర్ ధావన్.. 130- 140 స్ట్రైక్ రేటుతో ఆడతాడని మీరు ఆశిస్తే అది జరుగదు. కాబోయే రోజుల్లో మనం ఇంకా చాలా సాధించాలని భావిస్తున్నా. వైట్ బాల్ క్రికెట్‌లో మనం రెండు, మూడేళ్లు వెనుకంజలో ఉన్నామని నేను అనుకుంటున్నా. మనం ఉన్నత స్థానానికి చేరుకోడానికి కొత్త ఆటగాళ్లు కావాలి. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీషా లాంటి యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి" అని సబా కరీం స్పష్టం చేశారు.

శిఖర్ ధావన్ ఇటీవల జరిగిన బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో వరుసగా 7, 4, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సమయంలో రోహిత్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తను చేసిన తొలి సెంచరీనే డబుల్‌గా మలచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు.