Ronaldo wants Chef: నాకు ఛెఫ్ కావాలి.. నెలకు రూ.4.5 లక్షలు ఇస్తా: రొనాల్డో
Ronaldo wants Chef: నాకు ఛెఫ్ కావాలి.. నెలకు రూ.4.5 లక్షలు ఇస్తా అంటూ పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో చెబుతున్నాడు. అంత పెద్ద ప్లేయర్ కు ఓ పర్సనల్ కుక్ దొరకడం లేదట.
Ronaldo wants Chef: క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలోని మేటి ఫుట్‌బాల్ ప్లేయర్స్ లో ఒకడు. నిజానికి ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ లోనూ ఒకడిగా అతనికి పేరుంది. ఇక సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఓ వంటవాడి కోసం చూస్తున్నాడు. భారీగా జీతం ఇస్తానని చెప్పినా ఎవరూ దొరకడం లేదని రొనాల్డో బాధపడుతున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
పోర్చుగల్ లోని క్వింటా డా మరీనాలో తాను కట్టిస్తున్న లగ్జరీ ఇంట్లోకి భార్యతో కలిసి రొనాల్డో వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే అంతకుముందే తమ కుటుంబానికి ఓ పర్సనల్ కుక్ కావాలని అనుకుంటున్నాడు. మంచి నోరూరించే పోర్చుగీస్ ఫుడ్ తోపాటు ప్రపంచంలోని రకరకాల వంటలను చేసి పెట్టే ఛెఫ్ కోసం చూస్తున్నట్లు రొనాల్డో చెప్పాడు.
అంతేకాదు తమ దగ్గర వంట పని చేసే వ్యక్తికి నెలకు 4500 పౌండ్లు (సుమారు రూ.4.5 లక్షలు) ఇస్తాననీ ప్రకటించాడు. అయినా ఇప్పటి వరకూ ఎవరూ ముందుకు రాలేదు. రొనాల్డో రూ.170 కోట్లతో ఓ కళ్లు చెదిరే భవంతిని కట్టిస్తున్నాడు. ఈ ఏడాది జూన్ వరకూ ఆ ఇల్లు నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత భార్య జార్జినా రోడ్రిగెజ్, పిల్లలతో కలిసి రొనాల్డో ఆ కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు.
దీంతో ఆ ఇంట్లో తమకు వంట చేసి పెట్టే వ్యక్తి కోసం రొనాల్డో చూస్తున్నాడు. అతని కుటుంబమంతా భోజన ప్రియులు కావడంతో వాళ్ల డిమాండ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సుషీలాంటి జపాన్ వంటకాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ నోరూరించే వంటకాలు చేసి పెట్టాలని రొనాల్డో డిమాండ్ చేస్తున్నాడు.
ఈ మధ్యే రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల కాలానికిగాను రొనాల్డో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి అతడు రియాద్ లోని ఓ స్టార్ హోటల్లో ఉంటున్నాడు. గురువారమే పారిస్ సెయింట్ జెర్మెయిన్ టీమ్ తో ఆడిన రియాద్ సీజన్స్ టీమ్ లో రొనాల్డో ఉన్నాడు. ఈ మ్యాచ్లో పీఎస్‌జీ 5-4తో రియాద్ సీజన్స్ టీమ్ పై గెలిచింది. ఇందులో రొనాల్డో రెండు గోల్స్ చేశాడు.