India squad for Sri Lanka 2023: శ్రీలంకతో సిరీస్‌లకు భారత జట్లు ప్రకటన.. రోహిత్ పునరాగమనం.. ధావన్, పంత్ దూరం-rohit sharma returns for sri lanka odi series and hardik lead in t20i series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma Returns For Sri Lanka Odi Series And Hardik Lead In T20i Series

India squad for Sri Lanka 2023: శ్రీలంకతో సిరీస్‌లకు భారత జట్లు ప్రకటన.. రోహిత్ పునరాగమనం.. ధావన్, పంత్ దూరం

Maragani Govardhan HT Telugu
Dec 28, 2022 07:14 AM IST

India squad for Sri Lanka 2023: శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ. టీ20లకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించగా.. వన్డేలకు రోహిత్ పునరాగమనం చేయనున్నాడు. ధావన్, పంత్‌ను ఈ సిరీస్‌కు దూరంగా ఉంచారు.

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య (AP)

India squad for Sri Lanka 2023: టీ20ల్లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించాలి ఆనే వాదనలను నిజం చేస్తూ మరోసారి అతడిని పొట్టి ఫార్మాట్‌కు పగ్గాలు అప్పగించారు. రానున్న శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఈ ఆల్‌రౌండర్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించారు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు.. లంకతో సిరీస్‌ను కూడా ముందుండి నడిపించనున్నాడు. జనవరి 3 నుంచి లంక జట్టుతో టీమిండియా టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో.. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ 50-ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ20ల్లో అతడికి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఈ పొట్టి సిరీస్‌కు బ్రేక్ తీసుకోవడంతో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది భారత్.

ట్రెండింగ్ వార్తలు

చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌కు జట్లను ప్రకటించింది. విరాట్, రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లను టీ20 జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే కోహ్లీ బ్రేక్ తీసుకోగా.. కేఎల్ రాహుల్‌ను మాత్రం కావాలనే తప్పించినట్లు తెలుస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యమిచ్చింది.

పంత్‌కు మొండి చేయి..

రెండు సిరీస్‌లకు రిషబ్ పంత్‌ను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు ఇబ్బంది పడటంతో అతడిని దూరంగా ఉంచారు. టెస్టు క్రికెట్‌లో మాత్రం తనదైన ఆటతీరుతో అబ్బురపరుస్తున్నాడు పంత్. ఇటీవలే బంగ్లాదేశ్‌తో టెస్టులో 90 పరుగులు చేశాడు. పంత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టీ20లకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మరోపక్క ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన ఇషాన్ కిషన్‌ను రెండు జట్లలోనూ ఎంపిక చేశారు. సంజూ శాంసన్‌ టీ20లకు అవకాశం కల్పించగా.. వన్డే జట్టుకు మాత్రం దూరంగా ఉంచారు. 50- ఓవర్ల క్రికెట్‌లో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఇంక బౌలింగ్ విషయానికొస్తే ఐపీఎల్ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన శివమ్ మావి, ముకేష్ కుమార్ లాంటి యువ ఆటగాళ్లను టీ20 జట్టుకు ఎంపిక చేశారు.

ధావన్‌ను తప్పించారు..

శ్రీలంకతో జరగనున్న ఈ రెండు సిరీస్‌ల్లోనూ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయలేదు. టీ20 సిరీస్‌కు ఎప్పటి నుంచో అతడిని దూరం పెట్టగా.. తాజాగా 50 ఓవర్ల క్రికెట్ నుంచి కూడా తప్పించారు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ల్లో పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడిన ధావన్‌ను వన్డే జట్టులో తీసుకోలేదు. పలు అంతర్జాతీయ పర్యటనల్లో వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఇటీవల కాలంలో ఫామ్ లేమితో సమస్యలు ఎదుర్కొన్నాడు.

మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు కూడా మొండి చేయే చూపించారు సెలక్టర్లు. టీ20 వరల్డ్ కప్‌లో ఒత్తిడికి లోనై పరుగులు సమర్పించుకున్న అతడిని లంక పర్యటనకు తీసుకోలేదు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టీ20 వరల్డ్ కప్‌కు ముందు గాయపడటంతో అతడికి విశ్రాంతి కల్పించారు. గాయం నుంచి కోలుకున్నా.. ఫిట్నెస్ పెంచుకుని మైదానంలోకి అడుగుపెట్టేందుకు అతడికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. దీంతో అతడిని ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఎక్స్‌ప్రెస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను రెండు ఫార్మాట్లకు ఎంపిక చేశారు. జనవరి 3 నుంచి 15 వరకు శ్రీలంక భారత్‌లో పర్యటించనుంది.

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు..

హార్దిక్ పాండ్య(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముకేష్ కుమార్.

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు..

రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్య(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.

WhatsApp channel

సంబంధిత కథనం