Rohit and Virat in T20s: టీ20 ఫార్మాట్‌ వదిలి పెట్టలేదన్న రోహిత్‌.. వదలాల్సిందే అంటున్న బీసీసీఐ!-rohit and virat t20 future in doubt as bcci unlikely to consider the duo
Telugu News  /  Sports  /  Rohit And Virat T20 Future In Doubt As Bcci Unlikely To Consider The Duo
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (ANI )

Rohit and Virat in T20s: టీ20 ఫార్మాట్‌ వదిలి పెట్టలేదన్న రోహిత్‌.. వదలాల్సిందే అంటున్న బీసీసీఐ!

09 January 2023, 21:53 ISTHari Prasad S
09 January 2023, 21:53 IST

Rohit and Virat in T20s: టీ20 ఫార్మాట్‌ వదిలి పెట్టలేదని ఓవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంటున్నాడు. కానీ ఇక బీసీసీఐ అతనితోపాటు మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లిలను టీ20ల్లోకి తీసుకునే అవకాశమే లేదని వార్తలు వస్తున్నాయి.

Rohit and Virat in T20s: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిల టీ20 భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత ఈ ఫార్మాట్‌లో టీమ్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో పూర్తిగా యంగ్‌స్టర్స్‌తో ఓ ప్రత్యేకమైన టీమ్‌ను టీ20లకు ఎంపిక చేయాలని ఫ్యాన్స్‌ కూడా కోరారు.

ఇప్పుడు బీసీసీఐ ఆ దిశగా సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోహిత్‌, విరాట్‌లతో వాళ్ల టీ20 భవిష్యత్తుపై బోర్డు చర్చించనుంది. ఈ ఇద్దరూ టీ20లకు కూడా తాము అందుబాటులో ఉంటామని చెప్పినా.. బీసీసీఐ మాత్రం ఈ సీనియర్లను వన్డేలు, టెస్టులకే పరిమితం చేయాలన్న ఆలోచనలో కనిపిస్తోంది. ఈ అంశంపై రానున్న రోజుల్లో చేతన్ శర్మ ఆధ్వర్యంలోని సెలక్షన్‌ కమిటీ కూడా చర్చించనుంది.

టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత ఇప్పటి వరకూ వీళ్లు టీ20ల్లో ఆడలేదు. హార్దిక్‌ కెప్టెన్సీలో యువ టీమ్‌కు అవకాశాలు ఇస్తున్నాయి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ నాటికి రోహిత్‌, విరాట్‌లకు వయసు మీద పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సీనియర్లను తప్పించి యువకులకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ చూస్తోంది. అంతేకాదు ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ జరగనుండటంతో వీళ్లు ఆ ఫార్మాట్‌పైనే ఎక్కువగా దృష్టి సారించాలని భావిస్తోంది.

మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ మాత్రం తాను టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకోలేదని చెబుతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు అతడు మీడియాతో మాట్లాడాడు. "ప్రస్తుతానికి ఇది వన్డే వరల్డ్‌కప్‌ ఏడాది కావడంతో కొందరికి అన్ని ఫార్మాట్లలోనూ ఆడటం కష్టం. షెడ్యూల్‌ చూస్తే వరుసగా మ్యాచ్‌లు ఉన్నాయి. కొందరు ప్లేయర్స్‌పై పని భారాన్ని తగ్గించి వాళ్లకు తగినంత బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించాం. నేను కూడా అందులో ఒకడిని. ఈ ఏడాది కేవలం ఆరు టీ20లు మాత్రమే ఉన్నాయి. కానీ నేను మాత్రం ఆ ఫార్మాట్‌ను వదల్లేదు" అని రోహిత్‌ చెప్పాడు.

రోహిత్‌కు ఆ ఉద్దేశం లేకపోయినా.. బీసీసీఐ మాత్రం అతనితోపాటు విరాట్‌ను టీ20 ప్రణాళికల్లో భాగం చేసేలా కనిపించడం లేదు. టీ20లకు పూర్తిగా భిన్నమైన టీమ్‌ ఉండాలని బోర్డు భావిస్తోంది. వరుసగా రెండు వరల్డ్‌కపలలో ఇండియా సాంప్రదాయ టీమ్‌తోనే బరిలోకి దిగింది. ఇందులో సీనియర్లందరూ ఉన్నారు. అయితే ఈ రెండు వరల్డ్‌కప్‌లలోనూ టాపార్డర్‌ వైఫల్యం టీమ్‌ కొంప ముంచింది.

అందుకే టీ20లకు హార్దిక్‌ కెప్టెన్సీలో పూర్తిగా యువకులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తున్నారు. వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌ నాటికి వాళ్లు టీమ్‌లో కుదురుకుంటే.. ఈ మెగాటోర్నీ గెలిచే అవకాశాలు ఉంటాయన్నది వాళ్ల ఆలోచన. హార్దిక్‌తోపాటు టీ20ల్లో ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌, రాహుల్‌ త్రిపాఠీ, శుభ్‌మన్‌ గిల్‌లాంటి బ్యాటర్లు ఉన్నారు.

సంబంధిత కథనం