Rishabh Pant Health Update: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అతడు బాగానే కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు ఈ ప్రమాదం తర్వాత పంత్ తొలిసారి తనకు తానుగా లేచి కాళ్లపై నిలబడటం విశేషం.,అయితే ఈ గాయాల నుంచి అతడు పూర్తిగా కోలుకోవడానికి మాత్రం 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. ఆ లెక్కన ఈ ఏడాది మొదటి సగం పంత్‌ను క్రికెట్ ఫీల్డ్‌లో చూసే అవకాశం లేదు. హాస్పిటల్ నుంచి అతడు డిశ్చార్జ్ అయిన తర్వాత పంత్ తీసుకునే రీహ్యాబిలిటేషన్, ట్రైనింగ్‌పై అతని పూర్తి రికవరీ ఎప్పుడు అనేది ఆధారపడి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.,పంత్ మరో వారం రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్‌లోనే డిశ్చార్జ్ చేసే ముందు కాస్త అతన్ని అటూఇటూ నడిపించే ప్రయత్నం చేస్తారు. డిసెంబర్ 30న డెహ్రాడూన్, ఢిల్లీ హైవేపై పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం నుంచి పంత్ ప్రాణాలతో బయటపడటం ఓ అద్బతమే అని చెప్పాలి.,ప్రమాదం తర్వాత పంత్ ప్రయాణిస్తున్న కారు కాలి బూడిదైంది. అతన్ని సమయానికి హర్యానాకు చెందిన ఓ బస్ డ్రైవర్, కండక్టర్ కారు నుంచి బయటకు తీసుకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పంత్‌కు ఇప్పటికే జనవరి 8న మోకాలి సర్జరీ జరిగింది. దీని తర్వాత మడమ దగ్గర కూడా మరో సర్జరీ నిర్వహించనున్నారు. పంత్ గాయాల నుంచి కోలుకున్నా.. క్రికెట్ ఫీల్డ్‌లోకి రావడానికి మాత్రం కాస్త ఎక్కువ సమయమే పట్టనుంది.,ఆ లెక్కన ఐపీఎల్, ఆసియా కప్‌లతోపాటు వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మోకాలి సర్జరీ నుంచి కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుంది. అలా సర్జరీ జరిగిన తర్వాత దాని నుంచి కోలుకొని క్రికెట్ ఆడాలంటే మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇలా మోకాలి గాయానికి గురైన రవీంద్ర జడేజా కూడా నాలుగు నెలలుగా టీమ్‌కు దూరంగా ఉంటున్నాడు.,