Ravi Shastri warns Suryakumar: ఇవి టీ20లు కాదు వన్డేలు.. జాగ్రత్త.. సూర్యకుమార్‌కు రవిశాస్త్రి వార్నింగ్‌-ravi shastri warns suryakumar over his approach in one day cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ravi Shastri Warns Suryakumar Over His Approach In One Day Cricket

Ravi Shastri warns Suryakumar: ఇవి టీ20లు కాదు వన్డేలు.. జాగ్రత్త.. సూర్యకుమార్‌కు రవిశాస్త్రి వార్నింగ్‌

Hari Prasad S HT Telugu
Dec 01, 2022 10:49 AM IST

Ravi Shastri warns Suryakumar: ఇవి టీ20లు కాదు వన్డేలు.. జాగ్రత్త.. అంటూ సూర్యకుమార్‌కు రవిశాస్త్రి వార్నింగ్‌ ఇచ్చాడు. వన్డే క్రికెట్‌లోనూ సూర్య ఆడే తీరు చూసిన శాస్త్రి.. అతనికి కీలకమైన సూచనలు చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ కు కీలకమైన సూచనలు చేసిన రవిశాస్త్రి
సూర్యకుమార్ యాదవ్ కు కీలకమైన సూచనలు చేసిన రవిశాస్త్రి (AP/Getty)

Ravi Shastri warns Suryakumar: సూర్యకుమార్‌ యాదవ్‌ 2022లో సూపర్‌ హాట్‌ ఫామ్‌లో ఉన్నాడు. టీ20ల్లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎదిగాడు. టీ20 వరల్డ్‌కప్‌లో మూడో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అయితే వన్డే క్రికెట్‌కు వచ్చేసరికి సూర్యకుమార్ తేలిపోయాడు. అదే న్యూజిలాండ్‌లో అంతకుముందు జరిగిన టీ20ల్లో వీరబాదుడు బాదాడు. సెంచరీ కూడా చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

కానీ వన్డే సిరీస్‌లో వరుసగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో 4, 34, 6 రన్స్‌ మాత్రమే చేశాడు. రెండో వన్డేలో అతడు చేసిన 34 రన్స్‌ కూడా మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించిన తర్వాత. అంటే అది కూడా ఓ లెక్కన టీ20 ఫార్మాట్‌లాగే అతనికి అనిపించి ఉంటుంది. పూర్తిస్థాయి వన్డే గేమ్‌లో మాత్రం సూర్య క్రీజులో నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఈ విషయంలోనే సూర్యకు వార్నింగ్‌ ఇచ్చాడు మాజీ కోచ్‌ రవిశాస్త్రి.

వన్డేల్లో సూర్య ఆడుతున్న తీరు మరీ ఆందోళనకరంగా లేకపోయినా.. కొన్ని సూచనలు పాటించాలని చెప్పాడు. "ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే అతడు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. వన్డేలు టీ20ల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ సేపు సాగుతాయి. ఆ లెక్కన అన్ని ఎక్కువ బాల్స్‌ అతనికి ఆడటానికి అందుబాటులో ఉంటాయి. అతడు అంత సమయం వెయిట్ చేయొచ్చు. ఇన్నింగ్స్‌ చివర్లో విధ్వంసం అతనికి అలవాటు.

వన్డేల్లో ఆ కాస్త ఎక్కువ సమయం అతడు తీసుకోవాలి. చివర్లో విధ్వంసం కోసం కాస్త ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. ఇక కండిషన్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతటి ఫామ్‌లో ఉన్నా.. కండిషన్స్‌ను బట్టి నడుచుకోవాలి. మ్యాచ్‌ రోజు కండిషన్స్‌ను ఇప్పుడు పట్టించుకోకపోయినా ఏదో ఒక రోజు పట్టించుకోవాల్సిందే" అని ప్రైమ్‌ వీడియోతో మాట్లాడుతూ రవిశాస్త్రి అన్నాడు.

సూర్యకుమార్‌ ఇప్పటి వరకూ 42 టీ20లు ఆడగా.. కేవలం 16 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. వన్డేల్లోనూ ఆడుతున్న కొద్దీ మెరుగయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాదే వన్డే వరల్డ్‌కప్‌ ఉండటంతో సూర్యకుమార్‌ ఫామ్‌ ఇండియాకు కీలకం. టీమ్‌లో నంబర్‌ 4 స్థానాన్ని ఆక్రమించిన సూర్య.. వన్డేల్లోనూ కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలోనే రవిశాస్త్రి కొన్ని సూచనలు చేశాడు.

"పెద్దగా మార్చుకోవాల్సింది ఏమీ లేదు. గేమ్‌ ఎక్కువసేపు సాగుతుందని, ఎక్కువ బంతులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుంచుకుంటే చాలు. ఉపఖండంలో అతడు ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పటికి చాలా వరకూ మంచి స్కోరే అయి ఉంటుంది. దీంతో అక్కడి నుంచి అతడు ఆడుకోవచ్చు. అతని బ్యాటింగ్‌కు అనుకూలించే కండిషన్స్‌లో బౌలర్లు సూర్యను ఆపలేరు. అయితే వన్డేలకు తగినట్లుగా మారాల్సిన అవసరం ఉంది. అది అతడు నేర్చుకుంటాడు" అని శాస్త్రి చెప్పాడు.

WhatsApp channel