Rashid Khan in SA20: రషీద్ ఖాన్‌కు చుక్కలు.. ఒకే ఓవర్లో 28 రన్స్ బాదిన మార్కో జాన్సన్
Rashid Khan in SA20: రషీద్ ఖాన్‌కు చుక్కలు చూపించాడు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సన్. అతడు వేసిన ఓవర్లో ఏకంగా 28 రన్స్ బాదాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
Rashid Khan in SA20: ఈ మధ్యే క్రికెట్ లో కొత్తగా మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్ ఎస్ఏ20 (SA20) అభిమానులను అలరిస్తోంది. ఈ లీగ్ లోని బంతికీ, బ్యాట్ కూ మధ్య పోరును ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆప్ఘనిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సన్ ఏకంగా 28 రన్స్ బాదడం విశేషం.
నిజానికి రషీద్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. ఐపీఎల్ తో పాటు తన నేషనల్ టీమ్ కు ఆడిన సందర్భంలోనూ రషీద్ బౌలింగ్ ఎదుర్కోవడానికి చాలా మంది స్టార్ బ్యాటర్లు కూడా ఇబ్బంది పడతారు. కానీ సౌతాఫ్రికా లీగ్ లో మాత్రం అతని బౌలింగ్ ను ఆటాడుకున్నాడు ఆ దేశ ఆల్ రౌండర్ మార్కో జాన్సన్. సన్‌రైజర్స్ ఈస్టర్న్ తరఫున ఆడిన జాన్సన్.. ఎంఐ కేప్ టౌన్ బౌలర్ అయిన రషీద్ ను చితకబాదాడు.
ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఏకంగా 28 రన్స్ చేశాడు. ఆ ఓవర్లో జాన్సన్ నాలుగు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టడం విశేషం. మొదటి బంతినే సిక్స్ గా మలచిన జాన్సన్.. తర్వాతి బంతికి ఫోర్, తర్వాత వరుసగా మరో రెండు సిక్స్ లు, చివరి బంతికి మరో సిక్స్ బాదాడు. దీంతో ఆ ఓవర్లో 28 రన్స్ వచ్చాయి. ఓటమి ఖాయమనుకున్న సన్ రైజర్స్ టీమ్ ను జాన్సన్ ఒంటి చేత్తో గెలిపించాడు.
నిజానికి మ్యాచ్ ను పూర్తిగా మలుపు తిప్పింది రషీద్ వేసిన ఈ ఓవరే. ఆ తర్వాత మరింత చెలరేగిన జాన్సన్.. సన్ రైజర్స్ టీమ్ ను రెండు వికెట్లతో గెలిపించాడు. చివరికి అతడు కేవలం 27 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి మూడు ఓవర్లలో ఒక వికెట్ తీసుకొని 25 రన్స్ ఇచ్చిన రషీద్.. చివరికి 4 ఓవర్లలో 53 రన్స్ సమర్పించుకున్నాడు.
టేబుల్ టాపర్స్ గా ఉన్న ఎంఐ కేప్ టౌన్ టీమ్ కు ఇది ఊహించని ఓటమి. జాన్సన్ ఇప్పటి వరకూ సౌతాఫ్రికా టీమ్ తరఫున 10 టెస్టులు ఆడి 41 వికెట్లు తీసుకున్నాడు. 277 రన్స్ కూడా చేశాడు. ఇక మూడు వన్డేల్లో రెండు వికెట్లు, ఒక టీ20 మ్యాచ్ లో ఒక వికెట్ తీసుకున్నాడు.
సంబంధిత కథనం