Ramiz Raza Comments on India: రమీజ్ ఇక మారవా.. పదవీ పోయినా మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్ మాజీ
Ramiz Raza Comments on India: పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. పాక్‌తో పోలుస్తూ టీమిండియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ముందుకెళ్లడం భారత్ సహించలేకపోతుందని అన్నారు.
Ramiz Raza Comments on India: “చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు”.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా పదవీ పోయినప్పటికీ ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రజాకు భారత్‌ను ఆడిపోసుకోవడం మాత్రం ఆగలేదు. ప్రతి విషయంలో టీమిండియాను పాక్‌తో పోలుస్తూ తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా అద్భుతమైన ప్రదర్శన చేస్తోందని, అందుకే భారత క్రికెట్‌లో సమూల మార్పులు వచ్చాయని స్పష్టం చేశారు. పాక్ ముందుకెళ్లడం భారత్ సహించలేకపోతుందని అన్నారు.
"వైట్ బాల్ క్రికెట్‌లో మేము అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాం. మేము ఆసియా కప్ ఫైనల్, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడాము. భారత్ అక్కడ వరకు రాలేకపోయింది. బిలియన్ డాలర్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న ఇండియా చాలా వెనకంజలో ఉంది. వారు తమ ఛీఫ్ సెలక్టర్, సెలక్షన్ కమిటీ, కెప్టెన్‌ను కూడా మార్చారు. పాకిస్థాన్ ముందుకెళ్లడం భారత్ తట్టుకోలేకపోతుంది" అంటూ రమీజ్ రజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రమీజ్ రజా తన పీసీబీ ఛైర్మన్ పదవీ కోల్పోవడం గురించి మాట్లాడుతూ.. "ఇదెలా ఉందంటే ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఆడినా కానీ.. మొత్తం బోర్డును తొలగించినట్లుంది" అని ఫైర్ అయ్యారు. తాను పాకిస్థాన్ జట్టును ఐక్యతతో కలిసి ఉండేట్లు చేశానని, బాబర్ ఆజంకు అధికారం ఇచ్చానని పేర్కొన్నారు. కెప్టెన్ పవర్‌ఫుల్‌గా ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని రమీజ్ అన్నారు. రమీజ్ రజా వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పదవీ పోయినా అక్కసు మాత్రం తగ్గలేదంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా రమీజ్ రజాను ఇటీవలే తొలగించి నజామ్ సేథీ ఆ పదవీలోకి వచ్చారు. సొంతగడ్డపై నవంబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 0-3తో వైట్ వాష్‌కు గురి కావడం, ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో 0-1 తేడాతో ఓటమి పాలవ్వడంతో రమీజ్ రజాను తొలగించారు. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో పాక్ ఘోరంగా విఫలం కావడంతో పీసీబీలో భారీ మార్పులు చేశారు. ఛైర్మన్‌తో పాటు సెలక్షన్ ప్యానెల్‌ను కూడా మార్చారు. షాహిద్ అఫ్రిధీ మధ్యంతర సెలక్టర్‌గా ఎంపికయ్యాడు. అతడితోపాటు తన సహచన ఆటగాళ్లు అబ్దుల్ రజాక్, రావు ఇఫ్తీకర్ అంజూమ్ ప్యానెల్‌లో ఉన్నారు.
సంబంధిత కథనం