Rahul on Pant release: డ్రెస్సింగ్‌ రూమ్‌లో పంత్‌ కనిపించలేదు.. ఎందుకు రిలీజ్‌ చేశారో తెలియదు: రాహుల్‌-rahul on pant release says he was not aware why team released him ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rahul On Pant Release Says He Was Not Aware Why Team Released Him

Rahul on Pant release: డ్రెస్సింగ్‌ రూమ్‌లో పంత్‌ కనిపించలేదు.. ఎందుకు రిలీజ్‌ చేశారో తెలియదు: రాహుల్‌

Hari Prasad S HT Telugu
Dec 05, 2022 03:49 PM IST

Rahul on Pant release: డ్రెస్సింగ్‌ రూమ్‌లో పంత్‌ కనిపించలేదని, అతన్ని ఎందుకు రిలీజ్‌ చేశారో తెలియదని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే ఓడిన తర్వాత రాహుల్‌ మాట్లాడాడు.

కేఎల్ రాహుల్, రిషబ్ పంత్
కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (AP)

Rahul on Pant release: బంగ్లాదేశ్‌ చేతుల్లో టీమిండియా అనూహ్య ఓటమి భారత అభిమానులకు మింగుడు పడటం లేదు. గెలిచేశామనుకున్న మ్యాచ్‌లో ఇండియన్‌ టీమ్‌ బోల్తా పడింది. చివర్లో మెహదీ హసన్‌ పోరాటాన్ని ఊహించని టీమిండియా.. వికెట్‌ తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌లో విఫలమైన టీమ్.. తర్వాత బంగ్లాదేశ్‌ను బాగానే కట్టడి చేసినా.. చివర్లో చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు.

ట్రెండింగ్ వార్తలు

బ్యాటింగ్‌లో ఒక్క కేఎల్‌ రాహుల్‌ తప్ప మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. రాహుల్‌ మాత్రమే 70 బాల్స్‌లో 73 రన్స్‌ చేశాడు. అది కూడా తాను రెగ్యులర్‌గా ఆడే టాపార్డర్‌లో కాకుండా ఐదోస్థానంలో వచ్చి అతడీ కీలకమైన రన్స్‌ చేయడం విశేషం. అయితే అంతకుముందే రిషబ్‌ పంత్‌ను టీమ్‌ నుంచి రిలీజ్‌ చేయడంతో రాహుల్‌కు ఈ కొత్త రోల్‌ను అప్పగించారు.

దీనిపై మ్యాచ్‌ తర్వాత అతడు స్పందించాడు. "గత ఆరేడు నెలలుగా మేము ఎక్కువగా వన్డేలు ఆడలేదు. అయితే 2020-21లో చూడండి.. నేను వికెట్‌ కీపింగ్‌ చేయడంతోపాటు నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చాను. ఆ స్థానంలో నేను రావాలని టీమ్‌ నాకు ముందుగానే చెప్పింది. ఇక రిషబ్‌ పంత్‌ విషయానికి వస్తే ఏమైందో నాకు తెలియదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో అతడు కనిపించలేదు. కారణాలేంటో నాకు తెలియదు. మెడికల్‌ టీమ్‌ ఈ విషయంపై స్పష్టత ఇవ్వొచ్చు" అని రాహుల్‌ చెప్పాడు.

అయితే టీమ్‌ ఎప్పుడు అడిగినా తాను ఈ రోల్‌ ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ తెలిపాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మాత్రమే పంత్‌ను రిలీజ్‌ చేసిన విషయం టీమ్‌ మెంబర్స్‌కు తెలుసని అతడు చెప్పడం విశేషం. పంత్‌ను రిలీజ్‌ చేసినట్లు మాత్రమే చెప్పిన బీసీసీఐ.. దానికి కారణాన్ని మాత్రం వివరించలేదు.

"నేను అతన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌లో చూడలేదు. ఏమైంది అని అడిగాను. అతన్ని రిలీజ్ చేసినట్లు చెప్పారు. మేము మ్యాచ్‌పై దృష్టి సారించాల్సి ఉండటంతో దీనిపై ఎక్కువ ప్రశ్నలు అడగలేదు" అని రాహుల్‌ అన్నాడు. పంత్‌ను మెడికల్‌ కారణాలతో రిలీజ్‌ చేసినట్లు తెలిసింది.

WhatsApp channel