Rahul Dravid: రోహిత్, కోహ్లీకి రెస్ట్ ఇవ్వడంపై వివరణ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్
Rahul Dravid: రెండో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత వస్తున్న విమర్శలపై హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇవ్వడం గురించి సమాధానాలు చెప్పాడు.
Rahul Dravid: వెస్టిండీస్‍తో రెండో వన్డేలో టీమిండియా పరాజయం చవిచూసింది. ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసిన టీమిండియా ఎట్టకేలకు గెలిచింది. అయితే, శనివారం జరిగిన రెండో వన్డేలో కథ అడ్డం తిరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్‍లో విశ్రాంతినిచ్చింది టీమిండియా మేనేజ్‍మెంట్. దీంతో రెండో వన్డేలో బ్యాటింగ్‍లో ఘోరంగా విఫలమైన భారత జట్టు ఓడిపోయింది. దీంతో, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‍పై విమర్శలు వస్తున్నాయి. అతడిని తొలగించాలన్న డిమాండ్లు చేస్తున్నారు నెటిజన్లు. #SackDravid అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ విషయాలపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. అసలు రెండో వన్డేలో రోహిత్ శర్మ, కోహ్లీకి ఎందుకు రెస్ట్ ఇచ్చారో వివరణ ఇచ్చాడు.
కోహ్లీ, రోహిత్ లేకుండా రెండో వన్డేలో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 181 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ 36.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఎదురవుతున్న విమర్శలకు ద్రవిడ్ బదులిచ్చాడు. త్వరలో ఆసియాకప్, ఆ తర్వాత జరగనున్న ప్రపంచకప్ టోర్నీలను దృష్టిలో పెట్టుకొనే ప్రయోగాలు చేస్తున్నట్టు వెల్లడించాడు. గాయపడ్డ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోందని, అందుకే వేరే ఆటగాళ్లకు అవకాశాలిచ్చి ప్రయోగిస్తున్నామని అన్నాడు. ఒకవేళ పెద్ద టోర్నీల్లో వారు అప్పటికప్పుడు ఆడాల్సి వస్తే.. వారిని సంసిద్ధంగా ఉంచేందుకు ఇప్పడు అవకాశాలు ఇస్తున్నామని అన్నాడు.
“కొందరు ప్లేయర్లను ట్రై చేసేందుకు ఇదే చివరి అవకాశంగా ఉంది. మా నలుగురు ప్లేయర్లు గాయపడి ఎన్‍సీఏలో కోలుకుంటున్నారు. ఆసియా కప్, ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో రానుంది. ఎక్కువ సమయం లేదు. ఆసియాకప్, ప్రపంచకప్ టోర్నీలకు కొందరు ఆటగాళ్లు అందుబాటులోకి వస్తారని మేం అనుకుంటున్నాం. కానీ ఛాన్స్ తీసుకోలేం. వేరే ప్లేయర్లను కూడా మేం ట్రై చేయాలి. వారికి అవకాశాలు ఇవ్వాలి. అలా అయితే, ఏవైనా అనుకోని పరిస్థితులు ఏర్పడితే వారు మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధంగా ఉంటారు” అని ద్రవిడ్ చెప్పాడు.
ఈ ఏడాది ఆసియాకప్, ప్రపంచకప్‍లను దృష్టిలో ఉంచుకొనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు వెస్టిండీస్‍తో రెండో వన్డేలో రోహిత్ శర్మ, కోహ్లీకి రెస్ట్ ఇచ్చినట్టు ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. రోహిత్, కోహ్లీ స్థానంలో రెండో వన్డేలో తుది జట్టులోకి వచ్చారు సంజూ శాంసన్, అక్షర్ పటేల్. అయితే, ఆ ఇద్దరూ ఈ మ్యాచ్‍లో విఫలమయ్యారు.
“కొందరు ఆటగాళ్లపై మేం కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయి. ఆసియా కప్‍కు ముందు రెండు, మూడు మ్యాచ్‍ల్లో కోహ్లీ, రోహిత్ నుంచి మాకు ఆన్సర్స్ అవసరం లేదు. అయితే, ఎన్‍సీఏలో గాయపడిన ప్లేయర్లు, అనిశ్చితి ఉండడం వల్లే ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం” అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అంటే ఆసియా కప్, ప్రపంచకప్‍కు రోహిత్, కోహ్లీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని, అందుకే యువ ప్లేయర్లను రెడీగా ఉండేందుకు ఈ అవకాశాన్ని వాడుకుంటున్నామని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.
వెస్టిండీస్‍తో మూడు వన్డేల సిరీస్‍లో ఇండియా మొదటి మ్యాచ్ గెలిచింది. రెండో మ్యాచ్‍లో విండీస్ విజయం సాధించింది. దీంతో 1-1తో సిరీస్ సమంగా ఉంది. చివరి వన్డే ఆగస్టు 1న జరగనుంది. మరి ఈ మ్యాచ్‍లో టీమిండియా ప్రయోగాలు చేస్తుందా.. సిరీస్ దక్కించుకునేందుకు సేఫ్ గేమ్ ఆడుతుందా అనేది చూడాలి.
సంబంధిత కథనం