Rahul Dravid: నేనేమీ పర్ఫెక్ట్ కాదు.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి: ద్రవిడ్
Rahul Dravid: నేనేమీ పర్ఫెక్ట్ కాదు.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అన్నాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. అతని కోచింగ్ లో ఇండియా విజయాల కంటే పరాజయాలే ఎక్కువ చవి చూడటంతోపాటు జట్ల ఎంపిక విషయంలోనూ విమర్శలు తలెత్తాయి.
Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టి 20 నెలలు అవుతోంది. అయితే ఈ 20 నెలల్లో అతని కోచింగ్ లో విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి. జట్ల ఎంపికలోనూ తరచూ విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దీంతో వెస్టిండీస్ తో తొలి టెస్టు ప్రారంభానికి ముందు దీనిపై అతడు స్పందించాడు.
ట్రెండింగ్ వార్తలు
జట్ల ఎంపిక విషయంలో తానేమీ పర్ఫెక్ట్ కాదని, ప్రతిసారీ టీమ్ ఎంపిక సమయంలో అభిమానులను నిరాశకు గురిచేస్తూనే ఉన్నామని అతడు అన్నాడు. ద్రవిడ్ కోచింగ్ లో గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరడంలో విఫలమైన టీమిండియా.. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోయింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడంలో విఫలమైంది.
"కోచింగ్ ఇచ్చే ప్రతి ప్లేయర్ ను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాం. వాళ్లకు క్రికెట్ ప్లేయర్స్ గా కంటే వ్యక్తులుగా కోచింగ్ ఇవ్వాలనుకుంటాం. అలా చేసినప్పడు అందరూ సక్సెస్ కావాలని భావిస్తాం. కానీ అదే సమయంలో కాస్త వాస్తవికంగా ఆలోచించాలి. అందరూ సక్సెస్ కావడం కుదరదు. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది" అని ద్రవిడ్ క్రెడ్ క్యూరియస్ ఎపిసోడ్ లో అన్నాడు.
"ప్రతిసారి తుది జట్టును ఎంపిక చేసినప్పుడు అభిమానులు నిరాశకు గురవుతూనే ఉన్నారు. కొందరు ప్లేయర్స్ ఆడటం లేదు. ఓ టోర్నమెంట్ కోసం 15 మందిని ఎంపిక చేసినప్పుడు కూడా కొందరు ప్లేయర్స్ జట్టులో ఉండాలని ఆశిస్తున్నారు. అలాంటి ప్లేయర్స్ పై సానుభూతి చూపిస్తున్నారు.
కానీ మేము కూడా ప్రయత్నిస్తాం. ఈ విషయంలో నేను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు. ప్రతిసారీ సరైన జట్టునే ఎంపిక చేస్తామనీ చెప్పడం లేదు. కోచింగ్ లో ఇదే అత్యంత కఠినమైన విషయం. కచ్చితంగా సక్సెస్ కావాలనుకునే ప్లేయర్స్ విషయంలోనూ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది" అని ద్రవిడ్ అన్నాడు.
సంబంధిత కథనం