Telugu News  /  Sports  /  Rahul Dravi Reveals Dinesh Karthik Availability For Bangladesh Match
దినేశ్ కార్తిక్
దినేశ్ కార్తిక్ (AFP)

Dravid About Dinesh Karthik form: బంగ్లాతో మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ ఆడతాడా? రాహుల్ ద్రవిడ్ ఆసక్తిరక వ్యాఖ్యలు

01 November 2022, 14:09 ISTMaragani Govardhan
01 November 2022, 14:09 IST

Dravid About Dinesh Karthik form: టీమిండియా-దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ వెన్ను నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్‌పై ఆడతాడో లేదో అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

Dravid About Dinesh Karthik form: ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ లోపాలపై ఎక్కువగా మండిపడ్డారు. అలాగే జట్టు కూర్పుపై కూడా ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా దినేశ్ కార్తిక్‌ను తీసుకుని రిషభ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. అందేకాకుండా ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ వెన్ను నొప్పి కారణంగా చివరి ఓవర్లలో మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు జరగనున్న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడిస్తారా లేదా అనే అంశంపై అనుమానం నెలకొంది. తాజాగా ఈ అంశంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టత ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

"అతడు(దినేశ్ కార్తిక్) ఆ రోజు బాగానే ఉన్నాడు. దురదృష్టవశాత్తు బంతిని అందుకోడానికి దూకినప్పుడు వెన్ను నొప్పి వచ్చింది. దీంతో మైదానం వీడాల్సి వచ్చింది. అయితే చికిత్స అనంతరం కోలుకున్నాడు. ట్రైనింగ్‌కు కూడా వచ్చాడు. గాయంపై ఓ అంచనాకు వచ్చి చెబుతాం. అతడు వర్కౌట్ చేసిన తర్వాత రేపు అతడు ఎలా ఉంటాడో చూసి నిర్ణయం తీసుకుంటాం. తుది నిర్ణయం మ్యాచ్‌కు ముందు తెలుస్తుంది." అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అతడు 15 బంతుల్లో 6 పరుగులే చేయడంతో సర్వత్రా అతడి పామ్‌పై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై ద్రవిడ్‌ను ప్రశ్నించగా.. "దినేశ్ కార్తిక్ లాంటి ఆటగాడు ఎలా ఆడతాడో అంచనా వేయడం కష్టమని మీకు కూడా తెలుసు. అతడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాకెండ్‌లో వచ్చిన ఒక బంతినే ఎదుర్కొన్నాడు. నెదర్లాండ్స్‌పై బ్యాటింగే రాలేదు. దక్షిణాఫ్రికాపై సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అతడు మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడని అనుకున్నాం. అది మాకు అవసరం." అని తెలిపారు.

ప్రస్తుతం టీమిండియా గ్రూప్-2లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో నెగ్గి 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా ఆడిన మూడింటిలో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది.