Rafael Nadal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ లెజెండ్ రఫేల్ నదాల్.. ఆటకు ఎర్రమట్టి వీరుడి గుడ్‌బై
Rafael Nadal Retirement: టెన్నిస్ లెజెండ్ రఫేల్ నదాల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎర్రమట్టి వీరుడిగా పేరుగాంచి రికార్డు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన నదాల్.. తాను ఆటకు గుడ్ బై చెబుతున్నట్లు గురువారం (అక్టోబర్ 10) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
Rafael Nadal Retirement: రఫేల్ నదాల్ ఆటకు గుడ్ బై చెప్పాడు. టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్స్ లో ఒకడు.. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన వీరుడు.. మట్టికోట మహారాజుగా పేరుగాంచిన స్పెయిన్ బుల్ తన రెండు దశాబ్దాల కెరీర్ కు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో గుడ్ బై చెబుతూ అతడు పోస్ట్ చేసిన వీడియో అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తోంది. నవంబర్ లో జరగబోయే డేవిస్ కప్ ఫైనల్ తర్వాత తాను రిటైర్ కానున్నట్లు అతడు వెల్లడించాడు.
రఫేల్ నదాల్ రిటైర్మెంట్
22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్.. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్.. ఇది చాలు స్పెయిన్ లెజెండ్ రఫేల్ నదాల్ ఎంతటి గొప్ప టెన్నిస్ ప్లేయరో చెప్పడానికి. రెండు దశాబ్దాల పాటు టెన్నిస్ కోర్టులో చిరుతలా కదిలి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నదాల్.. ఇక తాను రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.
ఈ సందర్భంగా సుమారు ఐదు నిమిషాల వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. గడిచిన కొన్నేళ్లు వరస గాయాలతో చాలా కష్టంగా సాగాయని, ఈ రిటైర్మెంట్ నిర్ణయం కఠినమైనదే అయినా ఇదే సరైన సమయం అని భావించానని నదాల్ చెప్పాడు. జీవితంలో ప్రతిదానికి ఆరంభం, ముగింపు ఉంటాయని.. తాను కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని నదాల్ అన్నాడు.
మట్టికోట మహారాజు
స్పెయిన్ కు చెందిన రఫేల్ నదాల్ కు మట్టికోట మహారాజుగా పేరుంది. టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ లో ఒకటి, పారిస్ లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ లో ఎర్రమట్టి కోర్టులో నదాల్ కు తిరుగులేదు. అదే ఎర్రమట్టిపై ఫెదరర్ లాంటి లెజెండ్ కూడా ఒక్క టైటిల్ గెలవడానికి చెమటోడ్చిన వేళ.. ఏకంగా 14 టైటిల్స్ గెలిచిన ఘనత నదాల్ సొంతం.
ఎప్పుడో 2004లో తన కెరీర్ మొదలుపెట్టిన నదాల్.. ఈ 20 ఏళ్లలో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచాడు. నొవాక్ జోకొవిచ్ తర్వాత అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన ప్లేయర్ నదాలే. ఈ ఇద్దరి తర్వాత స్విస్ వీరుడు ఫెదరర్ 20 టైటిల్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు.
థ్యాంక్స్ చెప్పిన నదాల్
ఈ సందర్భంగా ఈ రెండు దశాబ్దాలలో తన వెంట నడిచిన అభిమానులందరికీ నదాల్ థ్యాంక్స్ చెప్పాడు. "నేను అనుభవించిన అన్నీ చూస్తే నేనెంతో అదృష్టవంతుడిని అనిపిస్తుంది. మొత్తం టెన్నిస్ ఇండస్ట్రీ, సహచరులు, నా ప్రత్యర్థులందరికీ థ్యాంక్స్.
ఎన్నో రోజులు వాళ్లతో నేను గడిపాను. నా జీవితం మొత్తం నెమరేసుకునే క్షణాలు నేను అనుభవించాను. చివరిగా నా అభిమానులు.. మీ రుణం నేను తీర్చుకోలేను. నాకు అవసరమైన శక్తిని మీరు అందించారు. నేను సాధించిందంతా కల నిజమవడం లాంటిదే. అందరికీ కృతజ్ఞతలు" అని నదాల్ అన్నాడు.