Pro Kabaddi League 11: రేపటి నుంచే పీకేఎల్ కొత్త సీజన్.. హైదరాబాద్‌లోనే షురూ.. ఈ సీజన్ కోటీశ్వరులు, ప్రైజ్ మనీ వివరాలివే-pro kabaddi league 11 to start tomorrow 18th october telugu titans to play against bengaluru bulls pkl 11 prize money ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pro Kabaddi League 11: రేపటి నుంచే పీకేఎల్ కొత్త సీజన్.. హైదరాబాద్‌లోనే షురూ.. ఈ సీజన్ కోటీశ్వరులు, ప్రైజ్ మనీ వివరాలివే

Pro Kabaddi League 11: రేపటి నుంచే పీకేఎల్ కొత్త సీజన్.. హైదరాబాద్‌లోనే షురూ.. ఈ సీజన్ కోటీశ్వరులు, ప్రైజ్ మనీ వివరాలివే

Hari Prasad S HT Telugu

Pro Kabaddi League 11: ప్రొ కబడ్డీ లీగ్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 18) నుంచి హైదరాబాద్ లోనే పీకేఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో తెలుగు టైటన్స్, బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. మరి ఈ టోర్నీలోని కోటీశ్వరులు ఎవరు? ప్రైజ్ మనీ వివరాలు తెలుసుకోండి.

రేపటి నుంచే పీకేఎల్ కొత్త సీజన్.. హైదరాబాద్‌లోనే షురూ.. ఈ సీజన్ కోటీశ్వరులు, ప్రైజ్ మనీ వివరాలివే

Pro Kabaddi League 11: ప్రొ కబడ్డీ లీగ్.. గ్రామీణ క్రీడపై కోట్ల వర్షం కురిపిస్తూ అర్బన్ ఏరియాల్లోకి కూడా తీసుకొచ్చిన లీగ్ ఇది. ఇప్పటికే విజయవంతంగా 10 సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు 11వ సీజన్ కు సిద్ధమైంది. శుక్రవారం (అక్టోబర్ 18) నుంచి హైదరాబాద్ లో తెలుగు టైటన్స్, బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ తో ఈ నయా సీజన్ ప్రారంభం కానుంది.

పీఎకేఎల్ 11 కోటీశ్వరులు వీళ్లే..

ప్రొ కబడ్డీ లీగ్ కు ప్రతి ఏటా ఆదరణ పెరుగుతుండటంతో దేశంలోని స్టార్ కబడ్డీ ప్లేయర్స్ పైనా కోట్ల వర్షం కురుస్తోంది. పీకేఎల్ 11 కోసం ఆయా ఫ్రాంఛైజీలు ఎగబడి వేలంలో ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. దీంతో ఈసారి ఏకంగా 8 మంది ప్లేయర్స్ కు వేలంలో రూ.కోటి, అంతకంటే ఎక్కువ ధర లభించడం విశేషం. వీళ్లలో ఇద్దరు ప్లేయర్స్ రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర పలికారు.

వీళ్లలో అత్యధికంగా సచిన్ తన్వర్ ఏకంగా రూ.2.15 కోట్లు పలికాడు. పీకేఎల్ చరిత్రలో ఇదే అత్యధిక మొత్తం. తమిళ తలైవాస్ ఫ్రాంఛైజీ అతన్ని కొనుగోలు చేసింది. ఇక అతని తర్వాత మహమ్మద్రెజా షాద్లౌయీ చియానే రూ.2.07 కోట్లు పలికాడు. అతన్ని హర్యానా స్టీలర్స్ సొంతం చేసుకుంది.

రూ.కోటిపైన పలికిన ప్లేయర్స్ వీళ్లే

ఇక వేలంలో రూ.కోటి, అంతకంటే ఎక్కువ పలికిన వాళ్లు మరో ఆరుగురు ఉన్నారు.

గుమన్ సింగ్ (గుజరాత్ జెయింట్స్) - రూ.1.97 కోట్లు

పవన్ సెహ్రావత్ (తెలుగు టైటన్స్) (ఎఫ్‌బీఎం) - రూ.1.72 కోట్లు

భరత్ (యూపీ యోధాస్) - రూ.1.3 కోట్లు

మణిందర్ సింగ్ (బెంగాల్ వారియర్స్) (ఎఫ్‌బీఎం) - రూ.1.15 కోట్లు

అజింక్య అశోక్ పవార్ (బెంగళూరు బుల్స్) - రూ.1.10 కోట్లు

సునీల్ కుమార్ (యూ ముంబా) - రూ.1.015 కోట్లు

ఇక్కడ ఎఫ్‌బీఎం అంటే ఫైనల్ బిడ్ మ్యాచ్ అని అర్థం. అంటే వేలంలో ఓ ప్లేయర్ ను ఓ ఫ్రాంఛైజీ ఎంత ధరకు పాడుతుందో.. అంతే ధర చెల్లించి అతన్ని తిరిగి పొందే అవకాశం దీని ద్వారా పాత ఫ్రాంఛైజీకి కలుగుతుంది. ఇలా తెలుగు టైటన్స్ పవన్ సెహ్రావత్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్లో రైట్ టు మ్యాచ్ కార్డులాంటిదే ఇది కూడా.

పీకేఎల్ 11 షెడ్యూల్ ఇలా..

ప్రొ కబడ్డీ లీగ్ ప్రతి సీజన్ చాలా సుదీర్ఘంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 24 వరకు మొత్తంగా 132 లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఆ తర్వాత ప్లేఆఫ్స్ మ్యాచ్ లు ఉంటాయి. వీటి షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. మొత్తంగా 12 టీమ్స్ తలపడనున్నాయి.

పీకేఎల్ సీజన్ 11 ప్రైజ్ మనీ ఇలా..

ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ మొత్తం ప్రైజ్ మనీ రూ.8 కోట్లుగా ఉంది. ఐదో సీజన్ నుంచి ప్రతి సీజన్ లోనూ మొత్తం ప్రైజ్ మనీ ఇంతే ఉంటూ వస్తోంది. ఇందులోనే విన్నర్, రన్నరప్ తోపాటు ఆరోస్థానం వరకూ నిలిచిన జట్లు, ప్లేయర్స్, రిఫరీలకు ప్రైజ్ మనీ అందిస్తారు.

విజేత - రూ.3 కోట్లు

రన్నరప్ - రూ1.8 కోట్లు

మూడు, నాలుగు స్థానాలు - ఒక్కొక్కరికి రూ.90 లక్షలు

ఐదు, ఆరు స్థానాలు - ఒక్కో జట్టుకు రూ.45 లక్షలు

అంటే మొత్తం రూ.8 కోట్ల ప్రైజ్ మనీలో రూ.7.5 కోట్లను టాప్ 6 జట్లకు పంచుతారు. ఇక మిగిలిన రూ.50 లక్షలను వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్స్, రిఫరీలకు అందజేస్తారు.

మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ - రూ.15 లక్షలు

బెస్ట్ రైడర్ - రూ.10 లక్షలు

ఏస్ డిఫెండర్ - రూ. 10 లక్షలు

ఉత్తమ డెబ్యుటెంట్ - రూ.8 లక్షలు

బెస్ట్ రిఫరీ (మేల్ అండ్ ఫిమేల్) - ఒక్కొక్కరికి రూ.3.5 లక్షలు