Prabath Jayasuriya: చరిత్ర సృష్టించిన శ్రీలంక స్పిన్నర్.. 72 ఏళ్ల రికార్డు బ్రేక్-prabath jayasuriya breaks 72 year old record in test cricket ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Prabath Jayasuriya Breaks 72 Year Old Record In Test Cricket

Prabath Jayasuriya: చరిత్ర సృష్టించిన శ్రీలంక స్పిన్నర్.. 72 ఏళ్ల రికార్డు బ్రేక్

శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (AFP)

Prabath Jayasuriya: చరిత్ర సృష్టించాడు శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య. టెస్టు క్రికెట్ లో 72 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు. ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.

Prabath Jayasuriya: శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య టెస్టు క్రికెట్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో అతడు 72 ఏళ్ల కిందటి రికార్డును చెరిపేశాడు. ఈ లెఫ్టామ్ స్పిన్నర్ టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌలర్లలో రెండోస్థానంలో నిలిచాడు. అయితే స్పిన్నర్లలో మాత్రం అతనిదే నంబర్ వన్ స్థానం. ఐర్లాండ్ తో గాలె క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు

జయసూర్య తన 7వ టెస్టులోనే 50 వికెట్లు తీయడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్ థామస్ రిచర్డ్‌సన్ (1896), సౌతాఫ్రికా బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ (2012) కూడా తమ ఏడో టెస్టులోనే 50 వికెట్ల మైలురాయి అందుకున్నారు. అయితే వీళ్లిద్దరూ పేస్ బౌలర్లు. ఇంతకుముందు టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న స్పిన్నర్ గా ఆల్ఫ్రెడ్ లూయిస్ వాలెంటైన్ పేరిట రికార్డు ఉంది.

ఈ వెస్టిండీస్ స్పిన్నర్ 1951లో తన 8వ టెస్టులో 50 వికెట్లు తీశాడు. అయితే ఇప్పుడు జయసూర్య 7వ టెస్టులోనే ఈ ఘనత సాధించి ఆ రికార్డు బ్రేక్ చేశాడు. ఇక టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసుకున్న బౌలర్ రికార్డు ఇప్పటికీ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ చార్లీ టర్నర్ పేరిటే ఉంది. అతడు 1988లో ఇంగ్లండ్ తో తన ఆరో టెస్టులోనే 50 వికెట్లు తీశాడు.

శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కెరీర్ కళ్లు చెదిరే రీతిలో ప్రారంభమైంది. అతడు గతేడాది ఆస్ట్రేలియాతో తన కెరీర్ ప్రారంభించగా.. తొలి టెస్టులోనే 12 వికెట్లు తీసుకోవడం విశేషం. రెండు ఇన్నింగ్స్ లోనూ ఆరేసి వికెట్లు తీశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ తో జరిగిన రెండు టెస్టుల్లో మరో 17 వికెట్లు తీసుకున్నాడు. ఆ సిరీస్ లోనూ రెండుసార్లు ఐదుకుపైగా వికెట్లు తీశాడు.

న్యూజిలాండ్ తో సిరీస్ లో రాణించలేకపోయాడు. అయితే ఇప్పుడు ఐర్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లతో మొత్తం 10 వికెట్లు తీశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరోసారి 5 వికెట్లతో టెస్టుల్లో 50 వికెట్ల క్లబ్ లో చేరాడు.

సంబంధిత కథనం