PKL 2024 Final: హర్యానా అదుర్స్.. ఫైనల్‍లో సత్తాచాటి తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్ కైవసం
PKL 2024 Final: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్ నిలిచింది. ఫైనల్‍లో పట్నా పైరేట్స్ జట్టుపై గెలిచి టైటిల్ పట్టింది హర్యానా. ఏకపక్ష విజయంతో సత్తాచాటింది.
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2024 టోర్నీలో హర్యానీ స్టీలర్స్ దుమ్మురేపింది. తొలిసారి పీకేఎల్ టైటిల్ సాధించింది. 11వ సీజన్ విజేతగా నిలిచింది. తుదిపోరులో పట్నా పైరెట్స్‌ను ఏకపక్షంగా చిత్తుచేసింది హర్యానా. పుణెలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా నేడు (డిసెంబర్ 29) జరిగిన పీకేఎల్ 2024 సీజన్ ఫైనల్‍లో హర్యానా 32-23 తేడాతో పట్నా టీమ్‍పై అద్భుత విజయం సాధించింది. జైదీప్ దహియా సారథ్యంలో తొలిసారి పీకేఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది హర్యానా. దుమ్మురేపే ఆటతో ఆధిపత్యం చూపి తుదిపోరులో గెలిచింది.
సెకండాఫ్‍లో హర్యానా దూకుడు
ఈ పీకేఎల్ ఫైనల్ పోరు తొలి అర్ధ భాగం హోరాహోరీగా సాగింది. హర్యానా, పట్నా పోటాపోటీగా పాయింట్లు సాధించాయి. దీంతో పోరు రసవత్తరంగా సాగింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి హర్యానా 15, పట్నా 12 పాయింట్లు సాధించాయి. ఇరు జట్ల మధ్య మూడో పాయింట్ల తేడానే ఉంది. అయితే, ఫైనల్ సెకండాఫ్‍లో హర్యానా దూకుడు ప్రదర్శించింది. ఆ జట్టు ఆటగాళ్లు పూర్తి అటాకింగ్ మోడ్‍లో ఆడారు. దీంతో ఆ హర్యానా వరుసగా పాయింట్లు సాధించింది. పాయింట్ల మధ్య అంతరం పెరుగుతూ పోయింది. చివరికి 32-23 తేడాతో ఏకపక్షంగా గెలిచింది హర్యానా. 9 పాయింట్ల తేడాతో తుదిపోరులో గెలిచి.. తన ఫస్ట్ పీకేఎల్ టైటిల్ పట్టేసింది.
అదరగొట్టిన శివం
హర్యానా రైడర్ శివం పటారే ఈ ఫైనల్ ఫైట్‍లో అదరగొట్టాడు. తొమ్మిది పాయింట్లతో ఈ మ్యాచ్‍లో సత్తాచాటాడు. 4 టచ్ పాయింట్స్, ఐదు టాకిల్ పాయింట్స్ సాధించాడు. మహమ్మద్ రెజా కూడా ఏడు పాయింట్లతో రాణించాడు. వినయ్ ఆరు పాయింట్లు సాధించాడు. పట్నా పైరెట్స్ టీమ్‍లో గుర్దీప్ ఆరు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే.. దేవాంక్ ఐదు పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్ సెకండాఫ్‍లో రెండు ఆలౌట్ పాయింట్స్ కూడా హర్యానాకు దక్కాయి. మొత్తంగా సత్తాచాటిన ఆ జట్టు ఈ సీజన్ చాంపియన్‍గా నిలిచింది.
11 సీజన్ల టైటిల్స్ విజేతలు వీరే
పీకేఎల్‍లో పట్నా పైరట్స్ మూడుసార్లు టైటిల్ సాధించి ఈ కబడ్డీ మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్‍గా ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది. 2014లో జరిగిన తొలి సీజన్‍లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ విజేతగా నిలిచింది.
- తొలి సీజన్ - జైపూర్ పింక్ ప్యాంథర్స్
- రెండో సీజన్ - యూ ముంబా
- మూడో సీజన్ - పట్నా పైరట్స్
- నాలుగో సీజన్ - పట్నా పైరట్స్
- ఐదో సీజన్ - పట్నా పైరట్స్
- ఆరో సీజన్ - బెంగళూరు బుల్స్
- ఏడో సీజన్ - బెంగాల్ వారియర్స్
- ఎనిమిదో సీజన్ - దబాంగ్ ఢిల్లీ
- తొమ్మిదో సీజన్ - జైపూర్ పింక్ ప్యాంథర్స్
- పదో సీజన్ సీజన్ - పుణెరి పల్టాన్
- పదకొండో సీజన్ - హర్యానా స్టీలర్స్