Paris Olympics Opening Ceremony: స్టేడియంలో కాదు...పడవల్లో అథ్లెట్ల ఎంట్రీ - వెరైటీగా ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు
Paris Olympics Opening Ceremony: ఒలింపిక్స్ ఆరంభ వేడుకల పరేడ్‌ను వెరైటీగా నదిపై నిర్వహించారు. పారిస్‌లోని సెన్ నదిపై అథ్లెట్ల పరేడ్ జరిగింది. ఈ వేడుకల్లో భారత్ 84వ దేశంగా ఎంట్రీ ఇచ్చింది. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఇండియన్ అథ్లెట్లు కనిపించారు.
Paris Olympics Opening Ceremony : పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలను వెరైటీగా నిర్వహించారు. ప్రతిసారి ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన అన్ని దేశాల అథ్లెట్ల బృందాలు స్టేడియంలో పరేడ్‌లను నిర్వహిస్తూ క్రీడాభిమానులకు కనువిందుచేసేవి.

ఈ సారి మాత్రం పరేడ్‌ను స్టేడియంలో కాకుండా పారిస్‌లోని సెన్ నదిపై నిర్వహించారు. పడవల్లో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్ల బృందాలు ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగాయి. నదిపై ఒలింపిక్ పరేడ్ నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి. దాదాపు అరు కిలో మీటర్ల మేర 85 పడవలతో ఈ పరేడ్ సాగింది.
84వ దేశంగా ఇండియా ఎంట్రీ...
ఈ పరేడ్‌లో మొదట గ్రీస్ దేశం ఎంట్రీ ఇచ్చింది. ఇండియా 84వ దేశంగా పరేడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ భారత అథ్లెట్ల బృందానికి ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. భారత అథ్లెట్లు టెడ్రిషనల్ డ్రెస్‌లలో ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా అథ్లెట్లు చీరల్లో, పురుష అథ్లెట్లు కుర్తాలో కనిపించారు. 117 మందికి 78 మంది అథ్లెట్లు మాత్రమే ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. హాకీ టీమ్‌తోపాటు రెజర్లు, వెయిట్ లిఫ్టర్లకు ఈవెంట్స్ ఉండటంతో ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు.
ఒలింపిక్ టార్చ్‌తో నాదల్...
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో పాప్ సింగర్లు లేడీ గాగా, సిలియాన్ డియోన్ పాప్ సాంగ్స్‌తో ఆహుతుల్ని అలరించారు. సెన్ నదిపై ఆరు కిలో మీటర్ల కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఈఫిల్ టవర్ వద్ద ఏర్పాటుచేసిన లేజర్ లైట్ షో ఈ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ లైట్ షో నుంచి రఫెల్ నాదల్ ఒలింపిక్ టార్చ్‌తో అభిమానుల ముందుకు రావడం హైలైట్‌గా నిలిచింది.
ఆ ఒలింపిక్ టార్చ్‌ను ఫ్రెంచ్ మాజీ టెన్నిస్ స్టార్ అమేలీ మౌరేస్మోకు నాదల్ అందించాడు. ఈ ఆరంభ వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయల్ మేక్రాన్ ఒలింపిక్స్ ఆఫీషియల్‌గా ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాడు. మేక్రాన్‌తో పాటు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌థామస్ బాక్ పాల్గొన్నాడు. వీరితో పాటు జినేదాన్ జిదాన్, టోనీ పార్కర్‌తో పాలు పలువురు ఫ్రాన్స్ లెజెండరీ ప్లేయర్లు ఈ వేడుకలో సందడి చేశారు.
మూడు లక్షల మంది అభిమానులు...
మొత్తం ఆరంభ వేడుకల్లో శరణార్థి టీమ్‌తో కలిసి 206 దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ ఆరంభ వేడుకలకు చూసేందుకు మూడు లక్షలకు పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ రోజు నుంచే ఒలింపిక్ క్రీడలు మొదలుకాబోతున్నాయి. మొత్తం 32 ఈవెంట్స్‌లో 10 500 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడుతోన్నారు. భారత్ నుంచి 16 ఈవెంట్స్‌లో 117 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు.