Paris Olympics Day 11 India Schedule: అందరి కళ్లూ నీరజ్ చోప్రా పైనే.. మళ్లీ గోల్డ్ తీసుకొస్తాడా?
Paris Olympics Day 11 India Schedule: పారిస్ ఒలింపిక్స్ 11వ రోజు ఇండియాలోని కోట్లాది మంది క్రీడాభిమానుల కళ్లు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ఈసారి కూడా గోల్డ్ తెస్తాడన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.
Paris Olympics Day 11 India Schedule: పారిస్ ఒలింపిక్స్ లో 10 రోజులు ముగిశాయి. 11వ రోజు కోట్ల మంది ఎదురు చూస్తున్న ఈవెంట్ రాబోతోంది. టోక్యోలో అసలు అంచనాలు లేకుండా దిగి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. మంగళవారం (ఆగస్ట్ 6) తొలిసారి తలపడబోతున్నాడు. అతనితోపాటు ఇండియన్ హాకీ టీమ్ కూడా సెమీఫైనల్లో ఆడనుంది.
అందరి కళ్లూ నీరజ్‌పైనే..
పారిస్ ఒలింపిక్స్ మొదట్లోనే షూటర్లు మూడు పతకాలు తీసుకొచ్చేసరికి దేశమంతా ఎంతో మురిసిపోయింది. ఈసారి రికార్డు మెడల్స్ ఖాయమని ఆశించారు. కానీ మెడల్ తెస్తారనుకున్న అథ్లెట్లు క్రమంగా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతుంటే నిరాశ ఆవరించింది. సింధు, సాత్విక్, చిరాగ్, నిఖత్ జరీన్, లక్ష్య సేన్, ఆర్చర్లు.. ఇలా ఫేవరెట్లందరూ ఉత్త చేతులతోనే ఇంటిదారి పట్టారు.
ఇక ఇప్పుడు అందరి కళ్లూ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. జావెలిన్ త్రోలో అతడు ఈసారి కూడా గోల్డ్ తెస్తాడన్న ఆశతో అభిమానులు ఉన్నారు. తొలి పది రోజుల్లో కేవలం 3 పతకాలతో సరిపెట్టుకున్న ఇండియా.. చివరి ఐదు రోజుల్లో ఏం చేస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. నీరజ్ తోపాటు ఇండియన్ హాకీ టీమ్, రెజ్లర్లు, వెయిట్ లిఫ్టర్లు మెడల్స్ పై ఆశలు రేపుతున్నారు.
నీరజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
నీరజ్ చోప్రా మంగళవారం ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ మధ్యాహ్నం 3.20 గంటల నుంచి ప్రారంభం కానుంది. అతడు ఇందులో అర్హత సాధిస్తే గురువారం (ఆగస్ట్ 8) జరగబోయే ఫైనల్లో తలపడతాడు.
ఈసారి నీరజ్ తోపాటు ఇదే జావెలిన్ ఈవెంట్లో ఇండియా నుంచి కిశోర్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. దీంతో క్వాలిఫికేషన్ రౌండ్ అస్సలు మిస్ కావద్దు.
ఇండియన్ హాకీ టీమ్ సెమీస్
40 ఏళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ఇండియన్ మెన్స్ హాకీ టీమ్.. ఈసారి కూడా మెడల్ పై ఆశలు రేపుతోంది. సెమీఫైనల్లో పటిష్టమైన జర్మనీతో మంగళవారం (ఆగస్ట్ 6) రాత్రి 10.30 గంటలకు తలపడనుంది.
పూల్ బిలో మూడు విజయాలతో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరిన మన టీమ్.. అక్కడ గ్రేట్ బ్రిటన్ ను పెనాల్టీల్లో ఓడించి సెమీస్ లో అడుగుపెట్టింది. ఇందులో గెలిస్తే మెడల్ ఖాయం. ఓడితే బ్రాంజ్ మెడల్ కోసం తలపడాల్సి ఉంటుంది.
ఇండియా షెడ్యూల్ ఇదే
టేబుల్ టెన్నిస్ మెన్స్ టీమ్ (ప్రీ క్వార్టర్స్): ఇండియా వర్సెస్ చైనా - మధ్యాహ్నం 1.30 గంటలకు
అథ్లెటిక్స్
మెన్స్ జావెలిన్ త్రో (క్వాలిఫికేషన్): కిశోర్ జేనా - మధ్యాహ్నం 1.50 గంటలకు
మెన్స్ జావెలిన్ త్రో (క్వాలిఫికేషన్): నీరజ్ చోప్రా - మధ్యాహ్నం 3.20 గంటలకు
వుమెన్స్ 400 మీటర్ల (రెపీచేజ్): కిరన్ పహల్ - మధ్యాహ్నం 2.50 గంటలకు
మెన్స్ హాకీ టీమ్ సెమీఫైనల్ - రాత్రి 10.30 గంటలకు